Money laundering case against Mahua Moitra- న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాపై ఈడీ కేసు నమోదు చేసింది. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారన్న ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే గతంలోనూ ఆమెపై ఈడీ కేసు నమోదైంది. ఆ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆమెకు మూడుసార్లు సమన్లు జారీ చేసింది. కానీ, మహువా మొయిత్రా మాత్రం విచారణకు హాజరుకాలేదు. 


గతంలోనే సీబీఐ కేసు నమోదు 
అవినీతిని నిరోధించేందుకు పనిచేస్తున్న లోక్‌పాల్ అంబుడ్స్‌మెన్ ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మహువా మొయిత్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీబీఐ కేసు నమోదైన కొన్ని నెలలకు తాజాగా మంగళవారం(ఏప్రిల్ 2న) ఈడీ అధికారులు టీఎంసీ మాజీ ఎంపీపై కేసు నమోదు చేశారు. 


టీఎంసీ ఎంపీగా ఉన్న సమమంలో మహువా మొయిత్రా లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారని భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ నిషికాంత్ దూబే ఆమెపై ఆరోపణలు చేశారు. దూబే  ఆరోపణలపై ప్రాథమిక విచారణ అనంతరం చర్యలు తీసుకోవాలని తర్వాత లోక్‌పాల్ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి 6 నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని లోక్‌పాల్ ఆదేశించింది. 


తనను ఉద్దేశపూర్వకంగానే లోక్ సభ నుంచి బహిష్కరించారని మహువా మొయిత్రా మరోసారి ఆరోపించారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లోనూ మహువాను కృష్ణా నగర్ నుంచే టీఎంసీ బరిలో నిలిపింది. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు బీజేపీకి పొలిటికల్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డారు.


గత ఏడాది లోక్ సభ నుంచి బహిష్కరణ 
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను గత ఏడాది లోక్ సభ నుంచి బహిష్కరించడం తెలిసిందే. నగదు తీసుకుని లోక్ సభలో ఉద్దేశపూర్వకంగానే ప్రశ్నలు అడిగారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలపై చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చించి ఓటింగ్ నిర్వహించారు. ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్ సభ ఆమోదించడంతో గత ఏడాది టీఎంసీ ఎంపీ మహుమా మొయిత్రాను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఎథిక్స్ కమిటీ నివేదికపై చర్చించాక.. మహువా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మొదట సీబీఐ అని, తరువాత ఈడీ అంటూ ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రశ్నించే గొంతులను బెదిరించడం బీజేపీ పరికిపంద చర్య అని ఆమె అన్నారు.