Pawan Munjal ED Raid: హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజల్ నివాసాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పై తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పవన్ ముంజల్ ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారన్న వార్త బయటకు రాగానే.. హీరో మోటార్స్ షేర్లు 3 శాతం మేర పతనం అయ్యాయి. ఈడీ అధికారులు మంగళవారం ఉదయాన్నే ఢిల్లీ, గురుగావ్ లోని పవన్ ముంజల్ నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇప్పటికే పవన్ ముంజల్ పై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద కేసులు నమోదు చేసినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
పవన్ ముంజల్ సన్నిహితులు ఒకరు ఇటీవల విమానాశ్రయమంలో భారీ మొత్తంలో విదేశీ కరెన్సీతో పట్టుబడ్డ విషయం తెలిసిందే. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. డీఆర్ఎస్ నుంచి అందిన సమాచారం నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా పవన్ ముంజల్ నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. హీరో మోటోకార్ప్ భారీగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి.. నిధులను మళ్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి షెల్ కంపెనీల్లో ఒక దాని వ్యవహారం కూడా ఈమధ్యే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కంపెనీతో హీరో మోటోకార్ప్ కు ఉన్న సంబంధం ఏమిటో విచారణ చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే గత సంవత్సరం భారీగా పన్ను ఎగవేత ఆరోపణలను కూడా హీరో మోటోకార్ప్ ఎదుర్కొంటోంది.
Also Read: Hyderabad News: హైదరాబాద్‌లో రెండో విమానాశ్రయం, కేంద్రానికి రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు - ఎక్కడంటే?
ఈడీ దాడుల వార్తల నేపథ్యంలో హీరో మోటాకార్ప్ కంపెనీ షేర్ ఏకంగా 3 శాతానికి పైగా పడిపోయింది. ఒక సమయంలో హీరో మోటోకార్ప్ ఏడాది కనిష్ఠ స్థాయి రూ.3,064 వద్ద ట్రేడ్ అయింది. చివరికి రూ. 3,100.05 వద్ద ముగిసింది. అంటే 3.24 శాతం పడిపోయింది. 2022 లో పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. వాహనాల అమ్మకాల సంఖ్య ప్రకారంగా హీరో మోటోకార్ప్ 2001లో ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించింది. గడిచిన 20 ఏళ్లుగా ఈ రికార్డును తన పేరు పైనే నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ ఆసియా, ఆఫ్రికా, దక్షిణ- మధ్య అమెరికాలోని 40 దేశాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇటీవల హోండా నుంచి హీరోకు గట్టి పోటీ ఎదురు అవుతోంది.