GST Collection July: 


వస్తు సేవల పన్ను వసూళ్లలో (GST Collections) భారత్‌ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2023, జులై నెలలో రూ.1.65 లక్షల కోట్ల జీఎస్టీ రాబడి సాధించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఏకంగా 11 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతే కాకుండా గతేడాదితో పోలిస్తే జులైలో దిగుమతి సేవలను కలుపుకొని స్థానిక లావాదేవీల ఆదాయం ఏకంగా 15 శాతం పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


మొత్తం వసూళ్లలో కేంద్ర జీఎస్టీ రూ.29,773 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ రూ.37,623 కోట్లు, సమ్మిళిత జీఎస్టీ రూ.85,930 కోట్లు ఉన్నాయి. వస్తువుల దిగుమతి ద్వారా రూ.41,239 కోట్లు వచ్చాయి. ఇక సుంకాల ద్వారా రూ.11,779 కోట్ల రాబడి వచ్చింది. ఇందులో దిగుమతి చేసుకున్న వస్తువుల ద్వారా రూ.840 కోట్లు లభించాయి.


ఆర్థిక మంత్రిత్వ శాఖ సమ్మిళిత జీఎస్టీ నుంచి రూ.39,785 కోట్లను కేంద్ర జీఎస్టీ, రూ.33,188 కోట్లను రాష్ట్రాల జీఎస్టీకి సర్దుబాటు చేసింది. మొత్తంగా జులైలో కేంద్రానికి రూ.69,558 కోట్లు, రాష్ట్రాలకు 70,811 కోట్ల ఆదాయం సమకూరింది.




'జీఎస్టీ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రకాల వస్తువులు, సేవలపై పన్నుల భారం తగ్గించి వినియోగదారులకు ప్రయోజనం కల్పించేందుకు బోర్డుకు ఇదో సూచనలా పనికొస్తుంది' అని ఎన్‌ఏ షా అసోసియేట్స్‌ భాగస్వామి పరాగ్‌ మెహతా అంటున్నారు.


ఆగస్టు మధ్య నుంచి శ్రావణ మాసం రాబోతోంది. ఆ తర్వాత వరుసగా రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, దసరా, దీపావళి పండుగల వస్తాయి. ఇళ్లు, కార్లు, బైకులు, విలువైన వస్తువులు కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే మూడు నెలల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డులు బద్దలు కొడతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.


మిగతా వాటితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్ల వృద్ధిరేటు తక్కువగానే ఉంది. 2022 జులైలో తెలంగాణలో రూ.4547 కోట్లు వసూలు చేయగా ఇప్పుడు 7 శాతం వృద్ధితో రూ.4849 కోట్లు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2022 జులైలో రూ.3409 కోట్లు ఉండగా 5 శాతం వృద్ధితో రూ.3593 కోట్లు వసూలయ్యాయి. వీటిలో ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్‌టీ కింద రూ.3345 కోట్లను తెలంగాణ, రూ.2755 కోట్లను ఆంధ్రప్రదేశ్‌కు సర్దుబాటు చేశారు.




Also Read: గుడ్‌న్యూస్‌ - LPG సిలిండర్ రేటు ₹100 తగ్గింది, కొత్త రేటు ఇదే


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.