ప్రపంచంలో హట్ టాపిక్ డేటా గోప్యత, దాని రక్షణ. దేశ పౌరుల డేటా భద్రత కోసం  ప్రత్యేక వ్యవస్థలను నిర్మించుకుంటున్నాయి. ఇతర దేశాల్లో తమ పౌరుల డేటాను భద్రపరచడం దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రత్యేకంగా డేటా రక్షణ, గోప్యత కోసం చట్టాలు తయారు చేసుకుంటున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు 194 దేశాలు ఉండగా 137 దేశాలు తమ ప్రజల భద్రత, గోప్యత కోసం ప్రత్యేకంగా చట్టాలు రూపొందించుకున్నాయి.  


ఈ కోవలోనే భారత్ సైతం అడుగులు వేస్తోంది. డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు (డీపీడీపీ)-2023ను జులైలో ఆమోదించిన కేబినెట్ ఆగస్టు మూడో తేదీ పార్లమెంటులో ప్రవేశ పెట్టింది. దీనిపై అంతకు ముందు ప్రముఖ కంపెనీలు, ప్రజలు, సంఘాలతో ప్రభుత్వం దాదాపు ఐదేళ్లు చర్చలు జరిపింది. పలు కార్పొరేట్, డేలా కంపెనీలు భారతీయుల వివరాల సేకరణ, ఎక్కడ ఉపయోగిస్తున్నారో తెలుసుకునేలా బిల్లు ప్రవేశ పెట్టారు.  


దాదాపు ఐదేళ్ల పాటు ఈ చట్టంలో పలు మార్పులు చేశారు. ఐరోపా తరహాలో డేటా గోప్యతా పాటించేలా ముసాయిదా చట్టం రూపొందించారు. దీని ద్వారా మన డేటా ఎక్కడ ఉపయోగిస్తున్నారో తెలుసుకునే అవకాశం కల్పించింది. అయితే కొన్ని కంపెనీల సూచనలు, విన్నపాల నేపథ్యంలో అమెరికా చట్టాల తరహాలో కొద్దిపాటి మార్పులు చేశారు. వినియోగదారుల వ్యక్తిగత డేటాతో ప్రైవేట్ కంపెనీలు వ్యవహరించే విధానంపై  కొన్ని కఠిన నిబంధన ఉన్నాయి. చివరగా బిల్లు అన్నికలబోసిన మిశ్రమంలా తయారైందని ప్రతిపక్షాలు విమర్శలు వెల్లువెత్తాయి. 


డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు (DPDP)-2023 నిబంధనల్ని ఉల్లంఘించిన ప్రతిసారీ సంబంధిత సంస్థలు రూ.250 కోట్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ముసాయిదా పేర్కొంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ గతంలో జారీ చేసిన ముసాయిదాలోని దాదాపు అన్ని నిబంధనల్ని ఈ బిల్లులో చేర్చారని అధికార వర్గాలు తెలిపాయి. ఏదైనా వివాదాలు తలెత్తితే దానిపై డేటా పరిరక్షణ మండలి (DPB) నిర్ణయం తీసుకుంటుంది. 


డేటా గోప్యతకు భంగం వాటిల్లితే పరిహారాన్ని కోరుతూ పౌరులు సివిల్‌ కోర్టుల్ని ఆశ్రయించవచ్చు. డేటాను సేకరిస్తున్న తీరు, దానిని భద్రపరుస్తున్న విధానం,  సమాచారాన్ని  ఎందుకు ఉపయోగిస్తున్నారో అడిగే హక్కు ప్రజలకు ప్రభుత్వం కల్పించింది. డేటా స్వీకారానికి ప్రజల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కంపెనీలు, యాప్స్‌, వ్యాపార సంస్థలకు మరింత జవాబుదారీతనంగా వ్యవహరిస్తాయి.