Delhi Shooting: ఢిల్లీలోని ఆర్కే పురంలోని అంబేద్కర్ బస్తీ ప్రాంతంలో ఆదివారం ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మృతులు 30 ఏళ్ల పింకీ, 29 ఏళ్ల జ్యోతిగా గుర్తించారు. ఆదివారం రోజు తెల్లవారుజాముల ఆర్కేపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు జరిపిన కాల్పుల్లో.. ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. నైరుతి ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ బస్తీలో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు కాల్చిచంపారని ఆర్కే పురం పోలీస్ స్టేషన్‌ కు తెల్లవారు జామున 4:40 గంటలకు పోలీసులకు ఫోన్ వచ్చిందని అన్నారు. ఈక్రమంలోనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నట్లు వెల్లడించారు. అయితే అప్పటికే వారిద్దరినీ ఆస్పత్రికి తరలించగా వారు చనిపోయారని చెప్పారు. డబ్బు సెటిల్మెంట్ వ్యవహారమై దీనికి కారణం కావొచ్చని.. అయితే విచారణ అనంతరం దీని వెనుక ఉన్న కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు వివరించారు. 







అయితే ఢిల్లీ పోలీసులు ఈ హత్యకు సంబంధించిన ప్రధాన నిందితుడిని, అతని సహచరుడిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ సౌత్ వెస్ట్ డీసీపీ మనోజ్ సి తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వార్తా సంస్థ పీటీఐ షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. 


అయితే ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బాధిత మహిళల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలను కాపాడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎల్‌జీకి బదులుగా ఆప్ ప్రభుత్వం రాష్ట్ర శాంతి భద్రతలను చూసుకుంటే ఢిల్లీ సురక్షితంగా ఉండేదని అన్నారు.


ఢిల్లీలోనే మరో ఘటన..


గురుగ్రామ్‌లోని మనేసర్‌లోని వైన్‌షాప్‌లో ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మనేసర్‌లోని పచ్‌గావ్ చౌక్‌లోని మద్యం దుకాణంలో శుక్రవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. మద్యం దుకాణం యజమాని కుల్దీప్ సింగ్ కు.. కొన్ని రోజుల క్రితం తనకు ఒక విదేశీ నంబర్ నుండి కాల్ వచ్చిందట. ఆ ఫోన్ చేసిన వ్యక్తి దుకాణాన్ని తనకు అప్పగించాలని బెదిరించినట్డలు చెబుతున్నాడు.






తెల్లటి దుస్తులు ధరించి బైక్ లు నడుపుతున్న వ్యక్తులు పారిపోయే ముందు కస్టమర్లు, దుకాణం చుట్టూ ఉన్న వ్యక్తులపై 15 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మొత్తం మద్యం షాపులోని సీసీటీవీలో రికార్డయిందని పోలీసులు వివరించారు. ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.