North Sikkim Landslides:
సిక్కింలో భారీ వర్షాలు..
సిక్కింలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయి. సిక్కిం అందాలను చూడాలని వచ్చిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండియన్ ఆర్మీ అలుపెరగకుండా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉంది. నార్త్ సిక్కింలోని చుంగ్తాంగ్‌లో వరదలకు ఓ వంతెన కొట్టుకుపోయింది. ఫలితంగా దాదాపు 300 మంది టూరిస్ట్‌లు ఓ చోట చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన సైనికులు వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వాళ్లకు అవసరమైన మెడికేషన్ ఇచ్చారు. ఆహారం అందించారు. నార్త్ సిక్కిమ్‌లో చాలా చోట్ల పరిస్థితులు ఇలానే ఉన్నాయి. ఇండియన్ ఆర్మీకి చెందిన త్రిశక్తి కార్ప్స్ (Trishakti Corps) అక్కడి పౌరులకు సాయం అందిస్తున్నాయి. చుంగ్తాంగ్‌లో ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. టూరిస్ట్‌లకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ క్రమంలోనే ఓ టూరిస్ట్ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆంబులెన్స్ తీసుకొచ్చి సమీపంలోని ఆర్మీ హాస్పిటల్‌కి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుట పడిందని అధికారులు వెల్లడించారు. నార్త్ సిక్కిం జిల్లా కలెక్టర్ హేమ్ కుమార్ చెత్రి ఇక్కడి పరిస్థితులను సమీక్షించారు. వాతావరణం అనుకూలించని కారణంగా...కొత్తగా టూరిస్ట్‌లు ఎవరినీ ఇక్కడికి అనుమతించడం లేదని స్పష్టం చేశారు. చాలా చోట్ల రహదారులు ధ్వంసం అయ్యాయని, వాటిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. టూరిస్ట్‌లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ టీమ్స్‌కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టూరిస్ట్‌లను కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు.
"నార్త్ సిక్కిమ్‌లో పరిస్థితులేమీ బాగాలేవు. అందుకే ఇకపై టూరిస్ట్‌లకు అనుమతి ఇవ్వడం లేదు. రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. వాటిని రీస్టోర్ చేసేందుకు శ్రమిస్తున్నాం. ప్రస్తుతానికి పౌరులను రక్షించడంతో పాటు రోడ్లను బాగు చేయడంపైనే దృష్టి పెడుతున్నాం. రహదారులు బాగయ్యాక అప్పుడు టూరిస్ట్‌లకు అనుమతిస్తాం"
- హేమ్ చెత్రి, చుంగ్తాంగ్ కలెక్టర్
Also Read: Bahubali Samosa: 12 కిలోల బాహుబలి సమోసా - ఆరగించారంటే రూ.71 వేలు మీ సొంతం! ఆ టైంలోగా తినేయాలి