Heatwave Deaths: 



యూపీ, బిహార్‌లో వేడిగాలులు..


బిపార్‌జాయ్ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో తప్ప దేశవ్యాప్తంగా ఇంకా ఎండ తీవ్ర తగ్గడం లేదు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, విదర్బ, ఒడిశా, వెస్ట్ బెంగాల్ సహా తెలుగు రాష్ట్రాల్లో వేడి గాలులు మరింత తీవ్రతరమవుతాయని IMD హెచ్చరించింది. ఇప్పటికే బిహార్‌లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగించారు. జూన్ 24 తరవాతే స్కూల్స్ తెరుచుకోనున్నాయి. బిహార్‌తో పాటు మరి కొన్ని రాష్ట్రాలు కూడా వేసవి సెలవును పొడిగించాయి. గోవా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఏపీలో నిర్ణయం తీసుకున్నారు. ఇక యూపీలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఎండ ధాటిని తట్టుకోలేక చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. బల్లియా జిల్లా ఆసుపత్రిలో దాదాపు 3వందల మంది చేరినట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్ 15వ తేదీన 23 మంది చనిపోగా...మరుసటి రోజు మరో 20 మంది ప్రాణాలు విడిచారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారే ఎక్కువగా మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. మరి కొందరు గుండెపోటుతో చనిపోయినట్టు చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోందని, వాళ్లే ఎక్కువగా ఆసుపత్రిలో చేరుతున్నారని వైద్యులు తెలిపారు. 


"60 ఏళ్లు పైబడిన వాళ్లే ఎక్కువ మంది చనిపోతున్నారు. మరణాలకు కారణమేంటన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. లఖ్‌నవూ నుంచి ఓ స్పెషల్ టీమ్ త్వరలోనే వచ్చి విచారణ చేపడుతుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు, తక్కువైనప్పుడు శ్వాసకోశ సమస్యలున్న వారికి అనారోగ్యం కలుగుతుంది. బహుశా ఇప్పుడు వేడి ఎక్కువగా ఉండటం వల్ల మరణాలు నమోదవుతుండొచ్చు"


- వైద్యాధికారి, యూపీ






అటు యూపీ ప్రభుత్వం కూడా ఈ మరణాలపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇక బిహార్‌లనూ ఇదే పరిస్థితులున్నాయి. 24 గంటల్లోనే 44 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 18 ప్రాంతాల్లో వేడిగాలులు సతమతం చేస్తున్నాయి. పట్నాలో 35 మంది చనిపోగా...నలందా మెడికల్‌ కాలేజ్‌లో మరో 9 మంది కన్నుమూశారు. 11 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బిపార్‌జాయ్ ఎఫెక్ట్‌తో వానలు ఆలస్యంగా కురిసే అవకాశాలున్నాయని ఇటీవలే IMD వెల్లడించింది. మరి కొద్ది రోజుల పాటు ఈ వేడిగాలులను భరించక తప్పేలా లేదు. 


Also Read: Mann Ki Baat: దేశంలో ఆ జబ్బు అంతానికి కృషి చేస్తున్న యువతకు మోదీ అభినందనలు - మన్‌కీ బాత్‌లో ప్రధాని