Mann Ki Baat: దేశంలో టీబీని అంతం చేసేందుకు యువత చేస్తున్న కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశాన్ని టీబీ రహితంగా మార్చడంలో యువత పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. నైనిటాల్ లోని దికర్ సింగ్ ను, కిన్నౌర్ కు చెందిన జ్ఞాన్ సింగ్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. మన్ కీ బాత్ 102 ఎపిసోడ్ లో భాగంగా ప్రధాని మోదీ వివిధ అంశాలపై ప్రసంగించారు. అమెరికా పర్యటన గురించి ఆయన చెప్పారు. అలాగే ఛత్రపతి శివాజీని స్మరించుకున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రసంగంలో ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించిన మోదీ.. అది దేశానికి చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. సాధారణంగా ప్రతి నెలా చివరి ఆదివారం రోజు మన్ కీ బాత్ కార్యక్రమం ఉంటుంది. అయితే ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్న దృష్ట్యా ఓ వారం ముందుగానే మన్ కీ బాత్ జరుగుతున్నట్లు ప్రధాని వివరించారు. వచ్చే వారంలో అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు చెప్పిన ప్రధాని.. అక్కడ ఉన్నన్ని రోజులు బిజీగా గడిచిపోనున్నట్లు చెప్పారు. అమెరికా పర్యటనకు ముందు దేశ పౌరులతో మాట్లాడాలని అనుకున్నట్లు మోదీ అన్నారు. మీతో సంభాషిస్తే.. మీ ఆశీస్సులతో స్ఫూర్తితో నా శక్తి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. 


'ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి '


మన్ కీ బాత్ ప్రసంగంలో భాగంగా ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు ప్రధాన మంత్రి. ఆ రోజుల్లో ఎంతో గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నట్లు చెప్పారు. అది దేశంలో చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. ఆనాటి రోజులు ఇప్పటికీ వెంటాడుతున్నాయని చెప్పారు. శివాజీ మహారాజ్ గురించి ప్రస్తావించిన మోదీ.. ఈ నెల ప్రారంభంలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి అయ్యాయని గుర్తు చేశారు. ఈ సందర్భాన్ని పెద్ద పండుగలా జరుపుకున్నట్లు చెప్పారు. వారి నైపుణ్యాలను తెలుసుకోవడం, వారి నుంచి నేర్చుకోవడం మనందరి కర్తవ్యమని సూచించారు. ఇలాంటి మన వారసత్వాన్ని తలచుకుని మనం ఎంతో గర్వపడతామని పేర్కొన్నారు. భవిష్యత్తుకు కూడా స్ఫూర్తిని పొందాతమని వివరించారు. 


'టీబీని తరిమికొట్టేందుకు యువత కృషి అభినందనీయం'


దేశంలో టీబీని అంతం చేయాలని, టీబీని తరిమికొట్టేందుకు యువత చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశాన్ని టీబీ రహితంగా మార్చడంలో యువత పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో నైనిటాల్ లోని ఓ గ్రామం దికర్ సింగ్ ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఆయన ఆరుగురు టీబీ రోగులను చేరదీసినట్లు తెలిపారు. అదే విధంగా కిన్నౌర్ కు చెందిన జ్ఞాన్ సింగ్ కూడా టీబీ రోగులకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తున్నట్లు మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ వారిని అభినందించారు. 


యూపీలో 40కి పైగా చెరువులను నిర్మించిన తులసీ రామ్


ఉత్తరప్రదేశ్ లోని బండా నివాసి తులసీ రామ్ యాదవ్ ను ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రశంసించారు. తులసీ రామ్ యాదవ్ 40కి పైగా చెరువులను నిర్మించారని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. హాపూర్ లో అంతరించిపోయిన వేప నదిని కూడా తులసీ రామ్ పునరుద్ధరించినట్లు ప్రధాని తెలిపారు. ప్రజల సమిష్టి కృషి వల్ల నదులు మళ్లీ జీవం పోసుకున్నాయని ప్రశంసించారు. ఏ రంగంలో అయినా చిత్తశుద్ధితో పని చేస్తే ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.