Indian Railways:


రైల్వే వ్యవస్థపై ఫైర్..


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మోదీ సర్కార్‌పై మరోసారి విమర్శలు చేశారు. దేశ రైల్వే వ్యవస్థపైనా మండి పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఎత్తకుండానే పరోక్షంగా ఆయనకు చురకలు అంటించారు. బాగా నడుస్తున్న రైల్వేని ఆయనొచ్చి అంతా నాశనం చేశారంటూ ఫైర్ అయ్యారు. ఏసీ కోచ్ బుక్ చేసుకున్నా కూర్చోడానికి చోటు దొరకడం లేదని, ప్రశాంతంగా నిద్ర పోవడానికి కూడా ప్రయాణికులకు కుదరడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఏసీ కోచ్‌లు జనరల్ బోగీల కన్నా అధ్వానంగా తయారయ్యాయని విమర్శించారు. రైల్వే వ్యవస్థను సరిగ్గా నడపలేని వ్యక్తి దేశాన్ని ఎలా నడిపిస్తాడంటూ ప్రశ్నించారు. 


"రైల్వే వ్యవస్థను ఎలా నడపాలో కేంద్ర ప్రభుత్వానికి తెలియదు. చెప్పినా అర్థం కాదు. ఓ నిరక్షరాస్య ప్రభుత్వం కేంద్రంలో ఉంది. అన్ని రైళ్లనూ నాశనం చేశారు. ఏసీ కోచ్‌ బుక్ చేసుకున్నా కూర్చోడానికి చోటు ఉండటం లేదు. జనరల్ బోగీల కన్నా దారుణంగా తయారయ్యాయి"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 










ఆర్‌జేడీ ట్వీట్..


కేజ్రీవాల్ రైల్వే వ్యవస్థపై విమర్శలు చేయడానికి ఓ కారణముంది. రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. పట్లిపుత్ర ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ కోచ్‌ బుక్ చేసుకున్న ఆ ప్రయాణికుడికి సీట్ కూడా దొరకలేదు. తాను జనరల్ కోచ్‌లో ఉన్నట్టు ఉందని అసహనం వ్యక్తం చేశాడు. జూన్ 14న ఈ ఘటన జరిగింది. IRCTC ఇలాంటి గొప్ప సర్వీస్‌ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ సెటైర్లు వేస్తూ పోస్ట్ చేశాడా ప్రయాణికుడు. దాన్ని రీట్వీట్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అటు ఆర్‌జేడీ కూడా దీనిపై ట్వీట్ చేసింది. ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అన్నీ ఒకే విధంగా ఉంటున్నాయని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ని కూడా కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు.