Munavar Show Cancel :  స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫరూఖీకి ప్రదర్శలు ఇవ్వాలంటే ఇతర చోట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.  ఈ నెల 28న ఢిల్లీలో నిర్వహించాల్సిన మునావర్‌ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మునావర్‌ షో ఢిల్లీలో మత సామరస్యాన్ని ప్రభావితం చేస్తుందన్న ఫిర్యాదులు రావడంతో  ఆయన షోకు అనుమతినివ్వలేదు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పోలీసు వ్యవస్థ మాత్రం కేంద్రం అధీనంలో ఉంటుంది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంత కావడంతో శాంతిభద్రతల అంశాన్ని కేంద్రమే చూస్తుంది. 
 
డోంగ్రీ పేరుతో దేశవ్యాప్తంగా స్టాండప్ కామెడీని లైవ్‌  షో చేసే మునావప్ కేథారనాథ్‌ సాహ్ని ఆడిటోరియంలోని డా.ఎస్‌పిఎం సివిల్‌ సెంటర్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు షో నిర్వహించాల్సి ఉంది.  ఇందు కోసం ముందుగానే అనుమతి తీసుకున్నారు.  తాజాగా పోలీసులు ఈ షోకు అనుమతి నిరాకరించారు. కాగా, ఇటీవల కాలంలో ఆయన షోలన్నీ రద్దు కావడం గమనార్హం. గత వారం బెంగళూరులో నిర్వహించాల్సిన ప్రదర్శనకు అనారోగ్య కారణాలతో రద్దు చేయగా.. హైదరాబాద్‌లో ప్రదర్శన మాత్రమే సక్సెస్‌ అయింది. కానీ ఆ షోకు అనుమతి ఇచ్చారన్న కారణంగా రాజాసింగ్ విడుదల చేసిన వివాదాస్పద వీడియో కారణంగా హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 


మునావర్ ఫారుఖీ తన స్టాండప్ కామెడీలో  హిందూ దేవతలతో పాటు.. కేంద్ర మంత్రి అమిత్‌షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల ఉన్నాయి. ఈ కేసుల్లో  గతంలో అరెస్టు అయి బెయిల్‌పై విడుదలైన నాటి నుండి మునావర్‌ షోలకు అనుమతి లభించడం లేదు. ఇటీవల కాలంలో సుమారు 15 షోలు రద్దయ్యాయి. ఢిల్లీలో మునావర్ ఫారుఖీ షోను రద్దు చేయడాన్ని ఇతర పార్టీలు ఖండించాయి.  విహెచ్‌పి రౌడీలకు లంగిపోయినందుకు ఢిల్లీ పోలీసులు.. వెన్నుముక  లేదని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా  వ్యాఖ్యానించారు. 'నా ఇంటికి నలువైపులా గోడలు నిర్మించడం, కిటికీలు పెట్టడం నాకు ఇష్టం లేదని గాంధీజీ అన్నారు. భారత్‌ 75 స్వాతంత్య్ర వేడుకలను జరుపుకున్న ఈ సమయంలో మత సామరస్యం ఈ రోజు అంత సున్నితమైపోయిందా.. ఈ కామెడీ షో ద్వారా దానికి విఘాతం కలుగుతుందా?' అని ప్రశ్నించారు.



మునావర్ ఫారుఖీ షోల్లో ఇటీవల వివాదాస్పదమన అంశాల జోలికి వెళ్లడం లేదు. హైదరాబాద్‌లో ఇచ్చిన ప్రదర్శనలోనూ ఆయన ఎలాంటి వివాదాలు.. రాజకీయ పరమైన స్టాండప్ కామెడీని చేయలేదని చెబుతున్నారు. అయితే ఆయనపై గతంలో చేసిన వివాదాలు మాత్రం.. షోలకు అడ్డం పడుతున్నాయి.