PM Modi Calls Cabinet Meeting : జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరి 29న మంత్రివర్గ సమావేశాన్ని జరుగుతున్నట్లు వార్తా సంస్థ IANS తెలిపింది. ఇది 2023లో మోదీ కేబినెట్ తొలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో మంత్రులందరూ పాల్గొనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. దీంతో కేంద్ర కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
చివరి పూర్తిస్థాయి బడ్జెట్
బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మంత్రులందరికీ ప్రధాని మోదీ ప్రత్యేక సూచనలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి బడ్జెట్ కాబట్టి, బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత మంత్రులందరూ తమ ప్రజా సంక్షేమ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ప్రధాని కోరుతున్నారని IANS తెలిపింది. భారత్‌కు లభించిన జీ-20 అధ్యక్ష పదవికి సంబంధించిన కార్యక్రమాలను కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రదేశాల్లో జీ-20కి సంబంధించి దాదాపు 200 కార్యక్రమాలు జరగనున్నాయి.
కేబినెట్ విస్తరణ
G20 దేశాలతో పాటు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంకుతో సహా 14 అంతర్జాతీయ సంస్థలు ఈ కార్యక్రమాలలో పాల్గొంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ కార్యక్రమాల్లో గరిష్టంగా ప్రజల్ని భాగస్వాములు చేసేందుకు చర్యలు చేపడుతోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, విస్తరణ, మంత్రులు తమ మంత్రిత్వ శాఖల పనితీరుకు సంబంధించి ప్రజెంటేషన్లను కూడా ఈ భేటీ చర్చించునున్నారని సమాచారం. జనవరి 29న జరగనున్న కేబినెట్ భేటీ తర్వాత కొద్ది రోజుల్లోనే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన కసరత్తులు ప్రారంభమవుతాయని IANS వార్తాసంస్థ తెలిపింది.
బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31వ తేదీన మొదలై..ఏప్రిల్ 6న ముగియనున్నాయి. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఇదే విషయాన్ని ఇటీవల ట్వీట్ ద్వారా వెల్లడించారు. దాదాపు 66 రోజుల పాటు 27 సార్లు సమావేశం కానున్నట్టు తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గతేడాది ఆగస్టులో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు ద్రౌపది ముర్ము. ఆ తరవాత లోక్‌సభ, రాజ్యసభలను ఉద్దేశిస్తూ బడ్జెట్ సమావేశాల్లో తొలిసారి ప్రసంగించనున్నారు. 66 రోజుల సమావేశాల్లో మధ్యలో కొన్ని రోజులు విరామం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకూ బ్రేక్ తీసుకుంటారు. ఈ గ్యాప్‌లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు మంత్రుల డిమాండ్‌లను పరిశీలించి వాటి ఆధారంగా రిపోర్ట్‌లు రూపొందిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి "ధన్యవాదాల తీర్మానం" ప్రవేశపెట్టాక బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడతారు. ఆ తరవాత యూనియన్ బడ్జెట్‌పై ప్రశ్నలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెబుతారు. ఇప్పటికే మంత్రులు కొన్ని డిమాండ్‌లను కేంద్రం ముందుంచారు. వీటిని మోడీ సర్కార్ పరిశీలిస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా వీటిపైనే దృష్టిసారించే అవకాశాలున్నాయి.