Delhi Mumbai Expressway:



ఫస్ట్ ఫేజ్‌ ప్రారంభం..


ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని...గత 9 ఏళ్లుగా మౌలిక వసతులపై పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిధులతో రాజస్థాన్‌ పురోగతి సాధిస్తుందని అన్నారు. 


"ఢిల్లీ ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే ఫస్ట్‌ ఫేజ్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. దేశంలోనే అతి పెద్ద ఎక్స్‌ప్రెస్‌ వే లలో ఇదీ ఒకటి. అభివృద్ధి చెందుతున్న భారత్‌కు ఇదే ప్రతీక. దౌసా ప్రాంత ప్రజలతో పాటు మొత్తం దేశవాసులకు నా అభినందనలు. ఈ సారి బడ్జెట్‌లో కేవలం మౌలిక వసతుల కోసమే రూ.10 లక్షల కోట్లు కేటాయించాం. 2014లో కేటాయింపుల కంటే ఇది 5 రెట్లు ఎక్కువ. రాజస్థాన్‌ ఈ నిధులతో ఎక్కువ లబ్ధి పొందుతుంది" 


ప్రధాని నరేంద్ర మోదీ










అతి పెద్ద ప్రాజెక్ట్..


ఢిల్లీ-దౌసా-లల్సోట్‌లను అనుసంధానించనుంది ఈ ఎక్స్‌ప్రెస్‌వే. ఒక్క దౌసాలోనే రూ.18,100 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్టు వివరించారు ప్రధాని మోదీ. కొత్త రోడ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్‌లు, మెట్రో రైళ్లు, ఎయిర్‌పోర్ట్‌లతో దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఆనందం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కోసం ఖర్చు చేసే నిధులే రేపు మరిన్ని పెట్టుబడులను తీసుకొస్తాయని చెప్పారు. అందుకే కేంద్రం వీటిపై ఎక్కువగా దృష్టి సారించిందని వివరించారు. ఢిల్లీ ముంబయి ఎక్స్‌ప్రెస్ వే వల్ల రాజస్థాన్‌కు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం పర్యాటకంగానూ అభివృద్ధి చెందటానికి ఈ మౌలిక వసతులు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు. ఢిల్లీ ముంబయి ఎక్స్‌ప్రెస్ వే పొడవు 264 కిలోమీటర్లు. ఈ నిర్మాణం కోసం కేంద్రం రూ.12,150 కోట్లు ఖర్చు చేసింది. సాధారణంగా ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లడానికి గతంలో 5 గంటల సమయం పట్టేది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా మూడున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. మొత్తంగా ప్రయాణ పరంగా చూస్తే ఢిల్లీ నుంచి ముంబయికి పట్టే సమయం 12% మేర తగ్గిపోనుంది. ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర..ఇలా ఆరు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నిర్మించారు. 


Also Read: Meta Layoffs: ఉద్యోగులను భయపెడుతున్న జుకర్ బర్గ్, మళ్లీ లేఆఫ్‌లు ఉంటాయట!