Delhi Liquor Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిట్ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో కీలక వాదనలు ముగిశాయి. తుది తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. మంగళవారం ధర్మాసరం తీర్పు వెల్లడించనుంది. ఈ వాదనలను జస్టిస్ట్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం విన్నది. కేజ్రీవాల్ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను ఈ ధర్మాసనం విచారణ చేసింది.


ఒకటి.. ముఖ్యమంత్రి అయిన తనను సీబీఐ నేరుగా అరెస్టు చేయడం లీగల్ కాదని వాదిస్తూ కేజ్రీవాల్ ఒక పిటిషన్ దాఖలు చేయగా.. బెయిల్ కోరుతూ మరో పిటిషన్ వేశారు. ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌ అభ్యర్థనను తిరస్కరిస్తూ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో కేజ్రీవాల్ తనకు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


ఢిల్లీ లిక్కర్ కేసులో జూలై 30న సప్లిమెంటరీ ఛార్జిషీటును సీబీఐ దాఖలు చేసింది. అందులో కేజ్రీవాల్, సత్యేందర్ జైన్, అమత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ మాథుర్, పి శరత్ రెడ్డి తదితరులను నిందితులుగా పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కూడా ఒక ప్రధాన కుట్రదారు అని సీబీఐ చార్జిషీటులో ఆరోపించింది. ఈయనకు దక్షిణాదికి చెందిన కల్వకుంట్ల కవిత, మాగుంట రాఘవ, అరుణ్ పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు, పి.శరత్ రెడ్డి, అభిషేర్ బోయినపల్లి, బెనోయ్ బాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సీబీఐ ఆరోపించింది.


కేజ్రీవాల్‌ను తొలిసారి సీబీఐ జూన్ 26న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటికే ఆయనపై ఇదే కేసులో ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ ఆరోపణలపై జుడీషియల్ కస్డడీలో ఉన్నారు. కేజ్రీవాల్‌తో సహా పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎక్సైజ్ పాలసీలో ఉద్దేశపూర్వకంగా లొసుగులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇలా చేయడం ద్వారా పొందిన నిధులను గోవాలో ఆప్ ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.