PM Modi Singapore Tour: బ్రూనై పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ చేరుకున్నారు. ఆరేళ్ల తర్వాత ప్రధాని మోదీ సింగపూర్లో పర్యటించనున్నారు. చాంగి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఎన్నారైలు, సింగపూర్ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సమయంలో ప్రధాని మోదీకి సింగపూర్‌లో ఓ మహిళ మోదీకి రాఖీ కట్టి స్వాగతం పలికారు. మహారాష్ట్ర ట్యూన్‌లో ప్రధాని ఢోలును వాయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని మోదీని చూసేందుకు ఆయనతో కరచాలనం చేసేందుకు భారతీయ కమ్యూనిటీ ప్రజలు భారీగా తరలివచ్చారు.
ప్రధానికి ఘన స్వాగతం
ప్రధాని మోదీ రెండ్రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆగ్నేయ ఆసియా దేశంలో ఆయనకు స్వాగతం పలికేందుకు భారతీయ సంఘం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పిఎం మోడీ తన కోసం ప్రదర్శన ఇస్తున్న కళాకారులతో కలిసి 'ఢోల్' (డ్రమ్) వాయించారు. తనకు ఘన స్వాగతం పలికినందుకు సింగపూర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనిలో ఒక కళాకారుడు డ్రమ్ వాయిస్తుండగా ప్రధాని అతడి వద్ద నుంచి డ్రమ్ తీసుకుని లయబద్ధంగా వాయించారు. అక్కడికి చేరుకున్న కళాకారుల ప్రదర్శనకు అనుగుణంగా ప్రధాని వాయించడం గమనార్హం. డ్రమ్ వాయిస్తూ అక్కడ గుమికూడిన భారతీయ సమాజాన్ని ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు.
అంతకు ముందు బ్రూనే వెళ్లిన మోదీ
అంతకుముందు ప్రధాని మోదీ బ్రూనై చేరుకుని అక్కడి సుల్తాన్ హాజీ హసనాల్ బోల్కియాను కలుసుకుని సింగపూర్ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల సమక్షంలో భారత్, బ్రూనై మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ పరంగా ప్రధాని మోదీ సింగపూర్ పర్యటన చాలా ముఖ్యమైనది. సింగపూర్‌లో ప్రభుత్వం మారి లారెన్స్ వాంగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఆయన పర్యటన జరుగుతోంది.
రాఖీలు కట్టిన మహిళలు
సింగపూర్‌లోని హోటల్‌కు ప్రధాని మోదీ చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న భారతీయ కమ్యూనిటీ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రధాని అక్కడి ప్రజలకు ఆటోగ్రాఫ్‌లు కూడా ఇచ్చారు. భారత సంతతికి చెందిన మహిళలు కూడా ప్రధాని మోదీకి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ప్రజల్లో ఉత్సాహం కనిపించింది. భారతీయ కమ్యూనిటీ ప్రజల ఉత్సాహాన్ని చూసిన ప్రధాని మోదీ కూడా మహారాష్ట్ర ట్యూన్‌కు డోలు వాయించారు. ఈ సందర్భంగా 'గణపతి బప్పా మోర్యా' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పీఎం మోడీ డ్రమ్ వాయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అక్కడ ప్రధాని దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జరుపుతున్న మొదటి పర్యటన ఇదే.
స్నేహాన్ని పెంపొందించే లక్ష్యంతో..
ప్రధాని మోదీ స్వాగత సమయంలో కళాకారులతో చేరిన వీడియోను మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ Xలో పోస్ట్ చేశారు. సింగపూర్‌లో కూడా మహారాష్ట్ర ఉత్సాహం, సంస్కృతి కనిపించిందన్నారు. ప్రధాని మోదీ X లో షేర్ చేసిన వీడియోలో తనను కలవడానికి గుమిగూడిన భారతీయ ప్రవాసులను చూడవచ్చు. ఈరోజు తెల్లవారుజామున సింగపూర్‌లో జరిగే సమావేశాల కోసం తాను ఎదురు చూస్తున్నానని.. ఇరు దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించే లక్ష్యంతో తన పర్యటన ఉంటుందని X లో పేర్కొన్నారు. సింగపూర్‌లో ప్రధాని మోదీకి ఇది ఐదవ అధికారిక పర్యటన. చివరిసారిగా 2018లో సింగపూర్‌కు వెళ్లిన మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు.