Delhi Floods: 


తగ్గిన ఉద్ధృతి


వరదలతో సతమతం అవుతున్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరటనిచ్చే కబురు చెప్పారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడిప్పుడే యమునా నది ఉద్ధృతి తగ్గుతోందని వెల్లడించారు. అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తరవాతే కీలక ప్రకటన చేశారు. "ఢిల్లీ ప్రజలకు ఓ గుడ్‌న్యూస్. యమునా నది నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది" అని స్పష్టం చేశారు. 


"భారీ వర్షాలకు యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అనుకున్న దానికంటే ముందే సిటీలోకి నీళ్లు వచ్చేశాయి. కానీ ఇప్పుడిప్పుడే నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. అయితే...కొన్ని చోట్ల ఇంకా వరద నీరు నిలిచిపోయింది. ఇకపై నది నీళ్లు సిటీలోకి రాకుండా మట్టితో గోడలు కడుతున్నారు. ఆర్మీతో పాటు NDRF కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటోంది. మరో మూడు నాలుగు గంటల్లో నీళ్లు సిటీలోకి రాకుండా అడ్డుకుంటామన్న నమ్మకముంది"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 






రెగ్యులేటర్ ధ్వంసం..


సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతానికి యమునా నది నీటిమట్టం 208.32 మీటర్లకు చేరుకుంది. రాత్రి సమయానికి ఇది 208.05 స్థాయికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వరదల కారణంగా చాలా ఇళ్లు జలమయం అయ్యాయి. ఎర్రకోట చుట్టూ నీళ్లు చేరాయి. సుప్రీంకోర్టు ఎంట్రెన్స్ వద్ద కూడా వరద నీరు చేరుకుంది. వరదల ధాటికి రెగ్యులేటర్‌ ధ్వంసం అయిపోయిందని, అందుకే సిటీలోకి ఎక్కువ నీళ్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే NDRF,ఆర్మీకి చెందిన ఇంజనీర్లు కూడా రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు. 


కారణమిదే..


వర్షాలు కురవడంతో పాటు హరియాణాలోని హత్ని కుండ్ బ్యారేజ్ (Hathni Kund Barrage)గేట్లు ఎత్తివేయడం వల్ల వరదల ధాటి పెరిగింది. ప్రస్తుత పరిస్థితులకు ఇదే కారణమని ప్రాథమికంగా భావించారు. అయితే..నిపుణులు మాత్రం ఢిల్లీ మునిగిపోవడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)కి చెందిన ఓ అధికారి కీలక విషయాలు వెల్లడించారు.


"హత్నికుండ్ బ్యారేజ్ నుంచి విడుదలై నీరు చాలా వేగంగా ఢిల్లీకి చేరుకున్నాయి. గతంలో ఇందుకు కొంత సమయం పట్టేది. ఢిల్లీ ఇలా మునిగిపోవడానికి ప్రధాన కారణం..అక్రమ నిర్మాణాలు. గతంలో ఎంత వరద నీరు వచ్చినా ప్రవహించేందుకు స్పేస్ ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. వరద నీరు ప్రవహించేందుకు దారి లేకుండా పోయింది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో అనూహ్య స్థాయిలో వర్షాలు కురవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బ్యారేజ్ గేట్‌లు ఎత్తేయాల్సి వచ్చింది. తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదవడమూ ఈ పరిస్థితులకు దారి తీసింది. "


- అధికారులు, CWC


Also Read: Chandrayaan 3 Launch: చంద్రుడి మీద చేసిన తొలి ప్రయోగంలో ఇస్రో గ్రాండ్ సక్సెస్ - రెండోది ఎక్కడ ఫెయిల్ అయింది?