Delhi Liquor Policy Case: న్యూఢిల్లీ: న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ఈడీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు గురువారం రాత్రి ఏడు నుంచి 9 గంటల వరకు దాదాపు రెండు గంటలపాటు కేజ్రీవాల్ ను ఆయన నివాసంలోనే 2 గంటలపాటు విచారించిన అనంతరం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్ కు ఇదివరకే 9 నోటీసులు ఇచ్చారు. సమన్లు జారీ చేసినా, కేజ్రీవాల్ ఈడీ విచారణకు డుమ్మా కొడుతూనే వస్తున్నారు. తనను ఈడీ అరెస్ట్ చేయకుండా దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఈడీ దూకుడుగా వ్యవహరించింది. హైకోర్టులో కేజ్రీవాల్ కు ప్రతికూల నిర్ణయం వెలువడగానే దాదాపు 8 మంది ఈడీ అధికారులు గురువారం రాత్రి కేజ్రీవాల్  ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ అరెస్టు అవుతారన్న ప్రచారంతో ఆప్ మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీ సీఎం ఇంటికి చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కుట్రదారుడు అని ఈడీ అధికారులు ఆరోపించారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ సహా మరికొందరితో కలిసి సౌత్ లాబీకి లాభం కలిగేలా కుట్ర చేశారని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. రూ.100 కోట్ల మేర చేతులు మారాయని, త్వరలోనే దర్యాప్తులో అన్ని విషయాలు బయటకొస్తాయని ఈడీ చెబుతోంది.






కేజ్రీవాల్‌కి హైకోర్టు షాక్
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ విజ్ఞప్తిని కోర్టు గురువారం తోసిపుచ్చింది. ఈడీ అరెస్ట్ నుంచి కేజ్రీవాల్ కు మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము ఈ కేసులో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. అయితే..ఈ పిటిషన్‌పై స్పందించాలని ఈడీని ఆదేశించింది. ఏప్రిల్ 22వ తేదీన మరోసారి విచారణ జరుపుతామని వెల్లడించింది. కానీ అంతలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని సోదా చేస్తున్నారు.


గత ఏడాది కేజ్రీవాల్‌కు తొలిసారి సమన్లు..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారి నోటీసులు ఇచ్చింది. ఆపై డిసెంబర్‌లో రెండోసారి సమన్లు, జనవరి 3న విచారణకు హాజరు కావాలని మూడోసార్ ఆప్ అధినేతకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ ఈ నోటీసులను అంతగా పట్టించుకోలేదు. విచారణకు హాజరుకాలేదు. ఆపై జనవరి 13న నాలుగోసారి, ఫిబ్రవరి 2న కేజ్రీవాల్‌కు ఐదవసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది. 


ఆపై ఫిబ్రవరి 19వ తేదీన 6వ సారి, విచారణకు హాజరు కావడం లేదని ఫిబ్రవరి 22న ఏడవసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. మార్చి 4న తమ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని ఈడీ 8వ నోటీసులు, తాజాగా 9వసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం వ్యాపారులకు లైసెన్సులను మంజూరు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీని కార్టెలైజేషన్‌కు అనుమతించింది. అయితే అందుకోసం కొందరు డీలర్లు లంచాలు చెల్లించారని ఆరోపణలున్నాయి. ఆప్ ప్రభుత్వం ఈ ఆరోపణల్ని మొదట్నుంచీ ఖండిస్తూనే వచ్చింది. ఈ విషయంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి కె సక్సేనా సిబిఐ విచారణకు సిఫారసు చేయగా.. ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది.