Curd name change: తమిళులకు భాషపై మమకారం, పట్టింపు మిగిలినవారి కంటే ఎక్కువేనన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో దుకాణాల బోర్డులపై తమిళంతో పాటు ఇతర భాషలు ఉండాలని ఇచ్చిన ఆదేశాలపై తమిళ తంబిలు ఆందోళనలు చేపట్టి మరీ తమ పంతం నెగ్గించుకున్నారు. తాజాగా బలవంతంగా తమపై హిందీ భాష రుద్దుతున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం కూడా ఆరోపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.
పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లంలో Curd, తమిళంలో ఉన్న ‘తయిర్ (Tayir)’ పేర్లను తొలగించి దహీ అనే పదం ముద్రించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆదేశాలు జారీ చేసింది. పెరుగుతో పాటు.. నెయ్యి, చీజ్ వంటి పాల ఉత్పత్తుల పేర్లను కూడా ఇలాగే మార్చాలని FSSAI ఆదేశించింది. దీనిపై తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ స్పందిస్తూ పెరుగు ప్యాకెట్లపై హిందీ పదమైన 'దహీ' పదాన్ని ముద్రించబోమని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)కి స్పష్టంచేసింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా FSSAI ఆదేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందీని బలవంతంగా రుద్దాలనే కేంద్రం చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. చివరకు పెరుగు ప్యాకెట్‌పైనా తమిళంలో ఉన్న పేరును మార్చేసి హిందీలో రాయమని ఆదేశించడం సరికాదని తెలిపారు. మాతృభాషల పట్ల ఈ తరహా నిర్లక్ష్యం పనికిరాదని, దీనికి బాధ్యులైన వారిని దక్షిణాది శాశ్వతంగా బహిష్కరిస్తుందంటూ స్టాలిన్ ధ్వజమెత్తారు.
FSSAI జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించిన తమిళనాడు పాల ఉత్పత్తుల అభివృద్ధి శాఖ మంత్రి నాసర్.. హిందీ నిబంధన డీఎంకే ఐదు ప్రధాన సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. ఆగస్టులోపు ఈ ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ FSSAI నుంచి తమకు లేఖ వచ్చిందని, అయితే ఆ ఆదేశాల అమలుచేసేందుకు తాము నిరాకరించామని వెల్లడించారు. "తమిళనాడులో హిందీకి స్థానం లేదు. మా ప్యాకెట్లపై పాలుకు బదులుగా హిందీలో 'దూద్' అని ముద్రించాలని వారు కోరుకున్నారు. కానీ మేం అంగీకరించలేదు" అని ఆయన వివరించారు.
FSSAI ఆదేశాలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలకు ఈ నిర్ణయం పూర్తిగా వ్యతిరేకమని, ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వివాదం నేపథ్యంలో వెనక్కి తగ్గిన FSSAI
తమ ఆదేశాలు తమిళనాడులో తీవ్ర వివాదానికి దారితీసిన నేపథ్యంలో FSSAI వెనక్కి తగ్గింది. పెరుగు పేరు మార్పుపై వెలువరించిన ఉత్తర్వులను సవరించింది. పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లంతో పాటు స్థానిక భాషల పేర్లను బ్రాకెట్లలో పెట్టుకోవచ్చని పేర్కొంది. ఈ విషయాన్ని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. దీంతో తమిళ ప్రజల శాంతించారు. ఇకపై హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.