Karnataka Congress Politics : దక్షిణాది నుంచి మెజార్టీ పార్లమెంట్ స్థానాల (Parliament Elections)పై కాంగ్రెస్ (Congress) పార్టీ గురి పెట్టింది. ఉత్తరాదిలో తక్కువ సీట్లు వచ్చినా సౌత్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. దశాబ్దాలుగా పార్టీకి విజయం దక్కని స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. బీజేపీ కంచుకోటలుగా భావిస్తున్న లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. సామాజిక సమీకరణాలు, సేవా కార్యక్రమాలు, ప్రజల్లో ఫేమ్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ (Actro ShivarajKumar Wife) సతీమణి గీతా శివరాజ్‌కుమార్ (Geetha Sivarajkumar)కు...టికెట్ ఇచ్చింది. షిమోగా లోక్‌సభ స్థానం నుంచి గీతా శివరాజ్‌కుమార్ పోటీ చేయనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు గీతా శివరాజ్‌కుమార్...కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థుల తరపున భర్తతో కలిసి ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ గెలుపునకు సహకరించిన గీతాకు... తాజాగా షిమోగా పార్లమెంట్ టికెట్ దక్కింది.
వ్యూహాత్మకంగా గీతా శివరాజ్ కుమార్ ను నిలబెట్టిన హస్తం పార్టీ
గీతా శివరాజ్‌కుమార్‌ను...కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా షిమోగా నుంచి బరిలోకి దించింది. 1999 తర్వాత హస్తం పార్టీ...ఈ పార్లమెంట్ స్థానం నుంచి గెలవలేదు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సోదరుడు మధు బంగారప్ప కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గంలో 1967 నుంచి ఆ కుటుంబానిదే ఆధిపత్యం. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే...13 పర్యాయాలు బంగారప్ప కుటుంబసభ్యులు విజయం సాధించారు. సొరబ అసెంబ్లీ...షిమోగా పార్లమెంట్ పరిధిలోనే ఉండటంతో పాటు బంగారప్ప కుటుంబానికి కంచుకోట కావడంతో గీతా శివరాజ్‌కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొంది...బీజేపీకి చెక్ పెట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది.
2014 ఎన్నికల్లో ఓటమి ఓటమి
గీత 2014లో జేడీఎస్ తరపున షిమోగా నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అందులో మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతోపాటు సోదరుడు మధు బంగారప్ప మంత్రిగా ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నారు. షిమోగా పార్లమెంట్‌కు 2004 నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలు జరిగితే...ఐదు సార్లు బీజేపీ, ఒకసారి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. గీతా శివరాజ్‌కుమార్ తండ్రి ఎస్ బంగారప్ప...ఇదే పార్లమెంట్ స్థానం నుంచి నాలుగుసార్లు విజయం సాధించారు. కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పని చేసిన ఎస్ బంగారప్ప...సొరబ అసెంబ్లీ నుంచి వరుసగా ఏడుసార్లు గెలుపొందారు.
నాలుగుసార్లు...నాలుగు పార్టీల తరపున గీతా తండ్రి పార్లమెంట్ కు ఎన్నిక
1996, 1999, 2004, 2005లో...నాలుగు సార్లు నాలుగు పార్టీల తరపున ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు. 2009 నుంచి షిమోగాను బీజేపీ కంచుకోటగా మార్చుకుంది. మాజీ సీఎం యడియూరప్ప ఒకసారి, ఆయన తనయుడు బీవై రాఘవేంద్ర ఇక్కడి నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మరోసారి రాఘవేంద్ర పోటీ చేసే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా గీతా శివరాజ్‌కుమార్‌ను బరిలోకి దించింది.