Karnataka Congress Legislature Party leader: కర్ణాటక కాంగ్రెస్ సీఎల్పీ భేటీ ఆదివారం రాత్రి బెంగళూరులో రసవత్తరంగా సాగింది. సీఎల్పీ భేటీలో కాబోయే సీఎం ను ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధిష్ఠానం కోరగా... ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం ఇచ్చారు. కర్ణాటకు కొత్త సీఎంను ఎన్నుకోవాల్సిన బాధ్యతను కాంగ్రెస్ హై కమాండ్ కే అప్పగిస్తున్నట్లు ఎమ్మెల్యేలంతా ఏక వాక్య తీర్మానం చేయడంతో కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈమేరకు డీకే శివకుమార్ లేదా సిద్ధరామయ్యలో ఎవరు సీఎం కావాలనేది హైకమాండ్ నిర్ణయించునున్నట్లు తెలుస్తోంది. 






సీఎల్పీ పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించడంపై ఏఐసీసీ అధ్యక్షుడికి అధికారం ఇస్తూ సింగిల్‌లైన్ తీర్మానాన్ని మాజీ సీఎం సిద్దరామయ్య ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని డీకే శివకుమార్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. సీఎల్పీ భేటీ ముగిసిన అనంతరం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని తెలిపారు. ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానాన్ని ఖర్గేకు వేణుగోపాల్ వివరించారు. అయితే ముగ్గురు సీనియర్ పరిశీలకులు పార్టీ ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకోవాలని, ఆ విషయాన్ని అధిష్టానానికి వెల్లడిస్తామని అన్నారు.



ఆదివారం అర్ధరాత్రి లోగా కాంగ్రెస్ పరిశీలకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా భేటీ అయ్యి వారి అభిప్రాయాన్ని సేకరించనున్నారు. చివరగా ఏ నేతను సీఎల్పీ అధ్యక్షుడిగా ఎన్నికోనున్నారో ఆ విషయాన్ని పార్టీ అధిష్టానానికి వివరించనున్నారు. అనంతరం ఢిల్లీ హై కమాండ్ కర్ణాటక కొత్త సీఎం ఎవరన్నది ప్రకటించనుంది. సిద్ధరామయ్య ఈ టర్మ్ తరువాత పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారు. మరోవైపు కెరీర్ ప్రారంభించప్పటి నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న డీకే శివకుమార్ సైతం సీఎం పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకూ తాను ఎన్నో త్యాగాలు చేశానని పార్టీ అధిష్టానానికి గుర్తుచేశారు.






కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 224 స్థానాల్లో కాంగ్రెస్ 135 సీట్లు కైవసం చేసుకుంది. కాగా, అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 66 సీట్లు గెలుచుకుని రెండో స్థానానికి పరిమితం కాగా, జనతాదళ్ (సెక్యులర్) 19 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇద్దరూ సీఎం రేసులో ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం వీరిలో ఒకరిని సీఎంగా చేయాలని భావించింది. కానీ పార్టీకి విజయాన్ని అందించిన నేతల్లో పార్టీ ఎమ్మెల్యేల్లో మెజార్టీ నేతల నిర్ణయంతో సీఎంను ఎంపిక చేయాలని ఏఐసీసీ భావించింది. కానీ ఆదివారం రాత్రి కొనసాగుతున్న సీఎల్పీ భేటీలో నేతలు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీనే కొత్త సీఎం ఎవరన్నది నిర్ణయించాలని తీర్మానం చేయడంతో కర్ణాటక సీఎం పదవిపై సస్పెన్స్ వీడలేదు.


మరోవైపు చెరో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని పంచుకోవాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పంపిన తీర్మానాన్ని మాజీ సీఎం సిద్ధరామయ్య ఓకే చేసినట్లు తెలుస్తోంది. కానీ, డీకే శివకుమార్ ఖర్గే అందుకు నిరాకరించినట్లు సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ప్రతిపాదనపై ఇద్దరు నేతలు సమ్మతించకపోవడంతో కర్ణాటక కొత్త సీఎం వ్యవహారం ఢిల్లీకి చేరనుంది. శివకుమార్, సిద్ధరామయ్యలను సోమవారం ఢిల్లీకి రావాల్సిందింగా హైకమాండ్ ఆదేశిస్తుందని బెంగళూరులో ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ, ఖర్గేతో ఢిల్లీలో చర్చించిన తరువాత కర్ణాటక కొత్త సీఎం ఎవరో తేలనుందన్న వాదన సైతం వినిపిస్తోంది.