Attack on CJI | న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బి.ఆర్. గవాయ్ మీద సుప్రీంకోర్టులో న్యాయవాది రాకేష్ కిషోర్ షూ విసిరే ప్రయత్నం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. విష్ణుమూర్తి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి సీజేఐ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో లాయర్ రాకేష్ ఆవేశానికి లోనై దాడికి యత్నించారు. అయితే జరిగిన ఘటనపై సుప్రీంకోర్టు లాయర్ రాకేష్ కిశోర్ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. దీనిపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అన్నారు. రాకేష్ కిషోర్ ఎందుకు అలా చేశారో కూడా చెప్పారు.

Continues below advertisement

ఖజురహోలోని ఒక దేవాలయంలో విష్ణువు విరిగిన విగ్రహాన్ని పునరుద్ధరించడానికి సంబంధించిన పిటిషన్ CJI బీఆర్ గవాయ్ విచారణ చేస్తున్నారు. 'హిందుస్థాన్ టైమ్స్' నివేదిక ప్రకారం, లాయర్ రాకేష్ కిషోర్ మాట్లాడుతూ.. ''ఒక దైవిక శక్తి నన్ను అలా దాడి చేయాలని సూచించింది. నేను జైలుకు వెళ్ళి ఉంటే బాగుండేది, నా కుటుంబం నేను చేసిన పనితో సంతోషంగా లేదు. వారు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు'' దేవుడు శాసించాడు.. నేను పాటించాను అనే తరహాలో లాయర్ రాకేష్ కిశోర్ చెప్పిన మాటలు విని అంతా ఆశ్చర్యపోతున్నారు. కానీ తన చర్యపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్పారు.

 రాకేష్ కిషోర్‌ను సస్పెండ్ చేసిన బార్ కౌన్సిల్

Continues below advertisement

సోమవారం నాడు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బిఆర్. గవాయిపై షూ విసిరే ప్రయత్నం చేసిన కేసులో నిందితుడైన న్యాయవాది రాకేష్ కిషోర్‌ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తక్షణమే సస్పెండ్ చేసింది. ఈ సంఘటన అక్టోబర్ 6 ఉదయం 11:35 గంటలకు జరిగింది. 71 ఏళ్ల న్యాయవాది రాకేష్ కిషోర్ సీజేఐ గవాయిపై షూ విసిరే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రాకేష్ కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

BCI అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా విడుదల చేసిన తాత్కాలిక సస్పెన్షన్ ఉత్తర్వులో, నిందితుడి ప్రవర్తన కోర్టు గౌరవానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. న్యాయవాదుల ప్రవర్తనా నియమావళి, అడ్వకేట్స్ చట్టం, 1961 నిబంధనలను రాకేష్ కిషోర్ ఉల్లంఘించారని పేర్కొన్నారు.

రాకేష్ కిషోర్ ఏ కోర్టులోనూ హాజరు కాలేరు

సస్పెన్షన్ సమయంలో నిందితుడైన న్యాయవాది రాకేశ్ కిషోర్ ఏ కోర్టులోనూ, అధికారం లేదా ట్రిబ్యునల్‌లో వాదనలకు హాజరు కాలేరు. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని BCI తెలిపింది. అయితే తన చర్యను లాయర్ ఇప్పటికీ సమర్థించుకుంటున్నారు. ఆయన తన చర్యలపై పశ్చాత్తాపం చెందడం లేదు. పైగా దైవ శక్తి సూచించడంతోనే సీజేఐ గవాయ్ మీద తాను దాడికి యత్నించానని చెబుతున్నారు. కానీ తన చర్యతో కుటుంబసభ్యులు అసంతృప్తిగా, తన మీద కోపంగా ఉన్న కారణంగా.. తాను జైలుకు వెళ్లినా బాగుండేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎలాంటి కేసు నమోదు కాలేదుసుప్రీంకోర్టు పరిపాలన విభాగం రాకేశ్ కిషోర్ పై పై అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. దాంతో పోలీసులు ఎటువంటి చట్టపరమైన చర్య తీసుకోలేదు. మూడుగంటల పాటు ప్రశ్నించిన అనంతరం లాయర్‌ను విడుదల చేశారు. అతని షూస్, పేపర్లను కూడా తిరిగి ఇచ్చారు. ఆ పేపర్లో ‘హిందూస్తాన్ సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించదు’ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. 

ఖజురహో ఆలయంపై వ్యాఖ్యలతో న్యాయవాది ఆగ్రహంసెప్టెంబర్ 16న జరిగిన విచారణ సందర్భంగా  గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లోని ఖజురహో ఆలయంలో విష్ణు విగ్రహాన్ని పునర్నిర్మించి తిరిగి ప్రతిష్టించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేశారు. ఇది లాయర్ రాకేష్ కిశోర్‌కు కోపాన్ని తెప్పించింది. మీరు విష్ణువుకు గొప్ప భక్తుడని అంటున్నారు. ఏదైనా చేయాలని దేవుడ్ని ప్రార్థించాలని సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యలతో లాయర్ రాకేశ్ కిషోర్ కోపంతో నిన్న దాడికి యత్నించారు. ఈ స్థలం భారత పురావస్తు సర్వే సంస్థ (ASI) సంరక్షణలో ఉందని, పునరుద్ధరణకు ముందు ఆ శాఖ అనుమతి తీసుకోవాలని సీజేఐ పేర్కొన్నారు.