Unclaimed Amount In Banks: న్యూఢిల్లీ: బ్యాంకులు, బీమా, మ్యూచువల్ ఫండ్‌లు లేదా పెన్షన్ పథకాల నుంచి క్లెయిమ్ చేయని డబ్బును తిరిగి పొందడంలో సహాయపడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నోటీసు జారీ చేసింది. పిటిషన్ ప్రధాన డిమాండ్ ఏంటంటే.. ప్రజలు తమ యాక్టివ్, అపరేట్ చేయని అకౌంట్లు లేదా క్లెయిమ్ చేయని ఖాతాలను చూడగలిగే ఒక కేంద్రీకృత వెబ్ పోర్టల్‌ను ప్రారంభించాలని కోరుతున్నారు. తమకు రావాల్సిన క్లెయిమ్ చేయని నగదు గురించి సమాచారం పొందడం ద్వారా సంబంధిత వ్యక్తులు వాటిని తిరిగి పొందే అవకాశం ఉంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల మాట్లాడుతూ.. దేశంలోని బ్యాంకులు, రెగ్యులేటర్స్ వద్ద అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.1.84 లక్షల కోట్లు ఉన్నట్లు ప్రకటించడం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం కోరిన సుప్రీంకోర్టు
పిటిషనర్ ఆకాష్ గోయల్ తరపున హాజరైన సీనియర్ లాయర్ ముక్తా గుప్తా వాదనలు విన్న తర్వాత, పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సంస్థల నుండి సుప్రీంకోర్టు సమాధానం కోరింది. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వ్ బ్యాంక్ (RBI), సెబీ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (IRDAI), నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ (NSI), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ (PFRDA) లకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు అన్ని పక్షాలను ఆదేశించింది.
ఆశ్చర్యకరమైన గణాంకాలను సమర్పించిన పిటిషనర్
పిటిషన్‌లో ఆశ్చర్యకరమైన అెక్కలను పొందుపరిచారు. దాని ప్రకారం దేశవ్యాప్తంగా 9.22 కోట్ల క్లోజ్ అయిన బ్యాంక్ ఖాతాలు (డోర్మెంట్ బ్యాంక్ ఖాతాలు) ఉన్నాయి. వీటిలో ప్రతి ఖాతాలో సగటున రూ.3,918 మొత్తం ఉంది. దాంతోపాటు రూ.3.5 లక్షల కోట్లకు పైగా క్లెయిమ్ చేయని మొత్తం బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, ప్రావిడెంట్ ఫండ్(PF)లు, చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మూలుగుతోంది.
వీటిలో ఎక్కువ భాగం చనిపోయిన వ్యక్తుల డబ్బు అని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారి చట్టపరమైన వారసులకు ఈ నగదు గురించి తెలియదు. అందుకు కారణం ఏమిటంటే.. ఆర్థిక సంస్థ వద్ద నామినీ (Nominee) వివరాలు అందుబాటులో లేవు. కొన్ని సందర్భాలలో తాము నామినీగా ఉన్నామని, ఆ నగదు ఉందన్న విషయం కుటుంబసభ్యులకు కూడా తెలియదు. ప్రజలు తమకు రావాల్సిన క్లెయిమ్ నగదు గుర్తించడానికి ఎటువంటి వ్యవస్థ లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
DEAF, IEPFలో రూ.1.6 లక్షల కోట్లకు పైగా
ఆధార్ లింక్డ్, ఈ-కెవైసి ఆధారిత సురక్షిత పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పోర్టల్‌లో ప్రజలు, వారి నామినేట్‌ల ఆర్థిక సంస్థలలోని ఆస్తుల సమాచారాన్ని ఒకే చోట ఉంచుతారు. క్లెయిమ్ చేయని నగదును నిర్వహించే 3 ప్రధాన చట్టబద్ధమైన నిధుల గురించి పిటిషన్‌లో ప్రస్తావించారు:
1. DEAF - ఇందులో బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన క్లెయిమ్ చేయని నిధుల నిర్వహణ
2. IEPF - ఇందులో క్లెయిమ్ చేయని షేర్లు, డివిడెండ్‌ల వివరాలు ఉంచుతారు
3. SCWF - ఇందులో క్లెయిమ్ చేయని ఇన్సూరెన్స్, చిన్న పొదుపు పథకాల నిధుల బదిలీ
DEAFతో పాటు IEPFలో రూ.1.6 లక్షల కోట్లకు పైగా నగదు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది భారత్ వైద్యశాఖ బడ్జెట్‌కు దాదాపు 3 రెట్లు అని, విద్యారంగ బడ్జెట్‌కు 2 రెట్లు ఎక్కువ అని కోర్టుకు విన్నవించారు. ఈ మొత్తాన్ని వారి అసలైన హక్కుదారులకు చేరకపోవడం సరికాదు అన్నారు.