చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశమయ్యారు, దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో జై శంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు. గల్వాన్ ఘటన తర్వాత అత్యున్నత స్థాయి చైనా నేత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
కీలక చర్చ
ఇరు దేశాల సరిహద్దు సమస్యలు, ఉక్రెయిన్‌పై రష్యా దాడి వంటి అంశాలపై వాంగ్ యూ, జైశంకర్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అఫ్గానిస్థాన్ పరిస్థితిపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. భారత్ రాకముందు వాంగ్ యీ మూడు రోజుల పాటు పాకిస్థాన్‌లో పర్యటించి తర్వాత అఫ్గానిస్థాన్ కాబూల్ వెళ్లారు. గురువారం సాయంత్రం వాంగ్ యీ దిల్లీ చేరుకున్నారు.
వాస్తవాదీన రేఖ ప్రాంతాల్లో ఉన్న సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియను అన్ని ప్రాంతాల్లో కొనసాగించాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీను కోరారు అజిత్ డోభాల్. దౌత్య, సైనిక స్థాయిలో సానుకూల చర్చల ప్రక్రియ కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలు చేపట్టే చర్యలు సమాన, పరస్పర భద్రతా స్ఫూర్తిని ఉల్లంఘించకుండా చూసుకోవాలని దిల్లీలో జరిగిన భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చారు.
వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్థాన్ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్‌పై వాంగ్ యీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) సదస్సులో వాంగ్ యీ జమ్ముకశ్మీర్ గురించి ప్రస్తావించారు. కశ్మీర్ విషయాన్ని ఓఐసీ సదస్సులో పలు ఇస్లామిక్ మిత్ర దేశాలు ప్రస్తావించాయని చైనా కూడా అదే కోరుకుంటోందని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలను భారత్ తప్పబట్టింది. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన విషయాలు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారాలని, చైనాతో సహా ఇతర దేశాలకు మాట్లాడే హక్కు లేదని పేర్కొంది. భారత్ తమ అంతర్గత సమస్యలపై ఇతరుల జోక్యం కోరదని గ్రహించాలని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన చేపట్టడం విశేషం.
Also Read: Zomato Instant Delivery: జొమాటోకు పోలీసుల షాక్- 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీపై సీరియస్
Also Read: Birbhum Violence Case: బంగాల్ హింసాకాండపై సీబీఐ దర్యాప్తు- కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం