Screen Time and Heart Health : నేటి డిజిటల్ యుగంలో పిల్లల జీవనశైలి వేగంగా మారుతోంది. హోంవర్క్ నుంచి బ్రేక్ సమయం వరకు, నిద్రపోయే ముందు, ఆన్‌లైన్ క్లాసులు, గేమింగ్, స్ట్రీమింగ్ కోసం స్మార్ట్‌ఫోన్‌లను చాలామంది పిల్లలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పిల్లల స్క్రీన్ సమయం వేగంగా పెరుగుతోంది. అయితే ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల కేవలం కళ్లు, మెదడుపైనే కాకుండా.. గుండె ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుందని షాకింగ్ విషయాన్ని తెలిపింది తాజా అధ్యయనం తెలిపింది.
ఖాళీ సమయంలో స్క్రీన్‌పై గడిపే ప్రతి అదనపు గంట.. సోషల్ మీడియాను స్క్రోల్ చేయడం, వెబ్ సిరీస్‌లను చూడటం లేదా గేమ్‌లు ఆడటం వంటివి పిల్లలలో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనం తెలిపింది. అసలు ఇది ఎంతవరకు నిజం? అధ్యయనంలో ఉన్న అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం?
అధ్యయనం ఏమి చెబుతోందంటే..
జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రచురించిన తాజా పరిశోధన ప్రకారం.. పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ప్రతి అదనపు గంట స్క్రీన్ టైమ్ వారి కార్డియో మెటబాలిక్ ప్రమాదాన్ని, అంటే గుండె, జీవక్రియకు సంబంధించిన ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ పరిశోధనలో 1000 మందికి పైగా పిల్లలు, యువకులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలలో స్క్రీన్ కోసం వెచ్చించే ప్రతి అదనపు గంట గుండె ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో తేలింది. కౌమారదశలో ఇది మరింత ఎక్కువగా కనిపించిందని అంటున్నారు. దీనితో పాటు ఎక్కువ స్క్రీన్ సమయం అనేది నిద్ర లేమితో కూడా నేరుగా ముడిపడి ఉందని గుర్తించారు.
నిద్రతో డైరక్ట్ లింక్..
తక్కువ నిద్రపోయే పిల్లలలో గుండెపోటు ప్రమాదం ఎక్కువగా పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. అర్ధరాత్రి వరకు స్క్రీన్ చూడటం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఇది శరీర జీవక్రియపై ప్రభావం చూపుతుంది. పరిశోధన ప్రకారం.. స్క్రీన్ సమయం, హార్డ్ డిస్క్‌ల మధ్య 12 శాతం సంబంధం నిద్ర లేమి ద్వారా ఏర్పడుతుంది. అంటే పిల్లలు బాగా నిద్రపోతే కొంతవరకు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్కువ కాలం స్క్రీన్ ముందు కూర్చోవడం పిల్లల శారీరక శ్రమను తగ్గిస్తుంది. ఇది బరువు పెరగడం, రక్తపోటు, చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగవచ్చు. ఇవన్నీ గుండె జబ్బులకు కారణం కావచ్చు.
ఇండియాలో పెరుగుతోన్న ఆందోళన
భారతదేశంలో కూడా పిల్లల్లో స్క్రీన్ సమయం వేగంగా పెరిగింది. ముఖ్యంగా ఆన్‌లైన్ విద్య, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం తర్వాత ఈ సమయం ఎక్కువైంది. కాబట్టి ఈ అధ్యయనం భారతీయ కుటుంబాలకు కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా పిల్లల నిద్ర, కార్యాచరణపై ప్రభావం కనిపిస్తుంది.
అయితే దీనిగురించి నిపుణులు మాట్లాడుతూ.. పిల్లల జీవనశైలిలో చిన్న మార్పులు చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అంటున్నారు. ప్రతిరోజూ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం.. నిద్రపోయే ముందు స్క్రీన్ నుంచి దూరంగా ఉండటం, పిల్లలను ఆటలు, శారీరక శ్రమ కోసం ప్రోత్సహించడం, ఇంట్లో కొంత సమయం, ప్రదేశాన్ని స్క్రీన్ లేకుండా ఉంచడం వంటి వాటితో ఈ రిస్క్ తగ్గించుకోవచ్చు.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
