Chhattisgarh Election 2023: 


ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారం..


ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల (Chhattisgarh Election 2023) ప్రచారంలో పాల్గొన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh). ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తమను తాము హీరోగా ఫీల్ అవుతుందని, కానీ అదో జీరో పార్టీ అని మండి పడ్డారు. ఈ సమయంలోనే రాష్ట్రంలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వీటిని అరికట్టలేకపోతోందని ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక వీటిని కచ్చితంగా కంట్రోల్ చేస్తామని తేల్చి చెప్పారు. మత మార్పిడిపై నిషేధం విధిస్తామని స్పష్టం చేశారు. 


"కాంగ్రెస్‌ ఓ అవినీతి పార్టీ. తమను తాము హీరోగా ఫీల్ అవుతోంది. కానీ అది ఓ జీరో పార్టీ. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఏదో ఆశ చూపించి కొంత మందిని మతం మార్చేస్తున్నారు. వాళ్లందరూ ఎందుకు మతం మారాలి..? బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఈ మత మార్పిడులపై నిషేధం విధిస్తుంది"


- రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి 


నక్సలిజాన్నీ చెరిపేస్తాం..


ఈ సభలోనే నక్సలిజం గురించీ ప్రస్తావించారు రాజ్‌నాథ్ సింగ్. తమకు అధికారం కట్టబెడితే మూడు నాలుగేళ్లలో రాష్ట్రంలో నక్సలిజం అనేదే లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి భూపేష్ బగేల్‌పైనా విమర్శలు సంధించారు. అవినీతి ఆరోపణలు చేశారు. 


"రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. అభివృద్ధి జాడే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ప్రజల్ని రిపోర్ట్ కార్డ్ అడిగితే వాళ్లు జీరో మార్కులు ఇస్తారు. ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు"


- రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి 







మరో ఐదేళ్ల పాటు అర్హులందరికీ ఉచిత రేషన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించీ ప్రస్తావించారు రాజ్‌నాథ్ సింగ్. ఆయుష్మాన్‌ భారత్‌లో (Ayushman Bharat) భాగంగా మెరుగైన వైద్యాన్నీ అందించే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారని గుర్తు చేశారు. రూ.5 లక్షల వరకూ అర్హులందరికీ ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని PSC ఎగ్జామ్‌ స్కామ్‌పైనా విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా ఈ స్కామ్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేశారు.


Also Read: Delhi Pollution: మస్కిటో కాయిల్స్ కాల్చకండి, మార్నింగ్ వాక్ మానేయండి - ఢిల్లీ వాసులకు ప్రభుత్వం సూచనలు