Haryana: హర్యానాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి చెందారు.  హర్యానాలోని యమునానగర్, అంబాలా జిల్లాల్లోని మందేబరి, పంజెతో కా మజ్రా, పూస్‌ఘర్, సరన్ గ్రామాల్లో ఈ కల్తీ మద్యం మరణాలు సంభవించాయి. ఈ గ్రామాల్లోని పలు షాపులకు కల్తీ మద్యం సరఫరా చేశారు. ఈ మద్యం తాగి ఆయా గ్రామాల్లోని 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ 19 మంది మరణించారు. కల్తీ మద్యానికి 19 మంది బలి కావడం హర్యానాలో కలకలం సృష్టించింది. మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. 


ఈ ఘటనపై విచారణ కోసం పోలీసులు ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్ కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగింది. ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ కాంగ్రెస్ నేత కుమారుడితో పాటు జననాయక్ జనతా పార్టీ నేత కుమారుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం అమ్మకం, సరఫరాలో వీరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే పాడుబడిన ఫ్యాక్టరీలో తయారుచేసిన 200 నకిలీ మద్యం డబ్బాలను అంబాలా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని యయునానగర్‌లో అరెస్ట్ చేసిన నిందితులకు సరఫరా చేసినట్లు గుర్తించారు. అలాగే 14 ఖాళీ డ్రమ్ములతో పాటు కల్తీ మద్యం తయారీకి వినియోగించిన వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. వారిచ్చిన సమాచారంతో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.


నిందితులకు సహకరించిన వారిని కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. దీంతో అరెస్ట్‌ల సంఖ్య పెరిగే అవకాశముంది. గతంలో కూడా హర్యానాలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన ఘటనలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు మరణాలు చోటుచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. కల్తీ మద్యాన్ని అరికట్టడంతో ప్రభుత్వం విఫలమైందని, ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  హర్యానా ప్రజలు ఏళ్లుగా కల్తీ మద్యం బారిన పడుతున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని, చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కల్తీ మద్యంను అరికట్టడంతో పూర్తిగా ఖట్టర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. 


అయితే కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారిలో వలస కూలీలు కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే కల్తీ మద్యం తయారుచేస్తున్న వారితో పాటు సరఫరా చేసి విక్రయిస్తున్న వారి పేర్లను బయటపెట్టేందుకు ప్రజలు భయపడుతున్నారు. పేర్లు బయటపెట్టారంటే తమకు భయంగా ఉందని, నోరు విప్పితే తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఓ గ్రామస్తులు చెప్పాడు. అలాగే ఓ బాధితుడి కుమారుడు మాట్లాడుతూ.. కల్తీ మద్యమే మా నాన్న ప్రాణం తీసిందని, ఎప్పుడూ తక్కువ మోతాదులోనే మద్యం తీసుకుంటాడని చెప్పాడు. కల్తీ మద్యం తాగి గత రాత్రి చనిపోయినట్లు ఆవేదనకు గురయ్యాడు. మృతుల గ్రామాల్లో బాధిత కుటుంబాల ఆర్తనాదాలతో విషాదఛాయలు అలుముకున్నాయి.