Ayodhya Deepotsav: 


అయోధ్యలో దీపోత్సవం..


ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో (Ayodhya Deepotsav) దీపావళి పండుగ సందడి మొదలైంది. ఇప్పటికే రామ మందిర నిర్మాణంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అయోధ్య...ఇప్పుడు పండుగ సందర్భంగా మరింత అందంగా ముస్తాబైంది. అంతే కాదు.  Guinness World Record కీ సిద్ధమవుతోంది. దీపోత్సవ్ కార్యక్రమంలో భాగంగా 51 ఘాట్స్‌లో 24 లక్షల దీపాలను వెలిగించనున్నారు. ఈరోజు (నవంబర్ 11) మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 24 లక్షల దీపాలను వెలిగించేందుకు 25 వేల మంది వాలంటీర్లు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ టీమ్‌ కూడా వస్తుంది. డ్రోన్ కెమెరా ద్వారా దీపాలను లెక్కించనుంది. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు పాల్గొననున్నారు. ఇప్పటికే కొందరు అయోధ్యకు తరలి వచ్చారు. దీపోత్సవం తరవాత లేజర్ షో (Ayodhya Laser Show) జరగనుంది. దీన్ని కూడా గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి సహా మంత్రులు వస్తుండడం వల్ల భద్రతపై దృష్టి పెట్టారు పోలీసులు. అయోధ్యను మొత్తంగా 14 పోలీస్ జోన్స్‌గా విభజించారు. AI సాయంతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అన్నిచోట్లా సీసీ కెమెరాలు పెట్టారు. ప్రతి కదలిక కూడా రికార్డ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతేడాది అయోధ్యలోని సరయు నదీ తీరంలో 15 లక్షల దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో 20 వేల వాలంటీర్లు పాల్గొన్నారు. అది కూడా గిన్నిస్ బుక్‌ రికార్డ్ సాధించింది. 






యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యులు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. రామమందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రధాని వేడుకల్లో స్వయంగా పాల్గొనేందుకు అంగీకరించారు. ప్రధాని మోదీతో సమావేశం అనంతరం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ మీడియాతో మాట్లాడారు. 2024 జనవరి 22న ఆలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి, 10 రోజుల పాటు 'ప్రాణ ప్రతిష్ఠ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయం భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం డిసెంబర్‌ నాటికి పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్‌ నృపేంద్ర మిశ్రా ఇటీవల తెలిపారు.