Cheetah Dies at Kuno National Park:

  మధ్యప్రదేశ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. కునో నేషనల్ పార్క్ లో ఇదివరకే కొన్ని మగ, ఆడ చిరుతలు చనిపోగా, తాజాగా మరో బ్యాడ్ న్యూస్. మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో మరో మగ చిరుత మృతి చెందింది. మగ చిరుత తేజస్ గాయపడినట్లుగా మానిటరింగ్ టీమ్ గుర్తించింది. ఆ టీమ్ చిరుత తేజస్ కు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. చికిత్స పొందుతూ మగ చిరుతపులి తేజస్ ప్రాణాలు విడిచింది. అంతకుముందు కొన్ని గంటలపాటు అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. 


తాజాగా చనిపోయిన చిరుతతో కలిపి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్‌లో మొత్తం 4 చిరుతలు, 3 చిరుత పిల్లలు మరణించాయి. దక్షిణాఫ్రికా నుంచి దేశానికి తీసుకొచ్చిన చిరుతలలో మగ చిరుత తేజస్ కూడా ఉంది. చివరగా మే నెలలో చిరుతలు చనిపోయాయి. మే 25న కునో పార్క్‌లో 2 చిరుత పిల్లలు చనిపోయాయి. ఇప్పుడు మగ చిరుత తేజస్‌ చనిపోవడంతో ఆఫ్రికా దేశాల నుంచి దేశానికి తరలించిన వాటిలో చనిపోయిన చిరుతల సంఖ్య 7కు చేరింది. అనారోగ్య, ప్రతికూల వాతావరణం సహా ఇతర కారణాలతో ఆడ, మగ కలిపి నాలుగు పెద్ద చిరుతలు, మూడు చిరుత పిల్లలు చనిపోయాయి.


మార్చి 27న తొలి చిరుత మృతి..
నమీబియా నుంచి భారత్ కు తరలించిన చిరుతపులలో తొలి చిరుత మార్చి 27న చనిపోయింది. నమీబియా నుంచి తరలించిన చిరుతల్లో ఒకటైన సాషా ఆడ చిరుత కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రాణాలు విడిచింది. నమీబియాలో ఉన్న సమయంలోనే సాషా అనారోగ్యంతో ఉందని అధికారులు భావిస్తున్నారు. అనంతరం దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మగ చిరుత ఉదయ్ ఏప్రిల్ 13న మరణించింది. కార్డియోపల్మోనరీ ఫెయిల్యూర్ కారణంగా ఉదయ్ అనే చిరుత చనిపోయినట్లు జూ సిబ్బంది వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మరో చిరుత దక్ష్ గాయాల కారణంగా మే 9న చనిపోయిందని తెలిసిందే. ప్రతికూల వాతారణ పరిస్థితులు, అనారోగ్య సమస్యలతో చిరుతులు వరుసగా చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆఫ్రికా నుంచి భారత్ కు తరలించినప్పుడే వీటిలో కొన్ని భారత్ లో పరిస్థితులు తట్టుకోలేక చనిపోయే అవకాశం ఉందని భావించామని అక్కడి ఉన్నతాధికారులు గతంలో ఓ ప్రకటనలో తెలిపారు. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial