Supreme Court : ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు అక్రమని స్పష్టం చేసిదంి. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గౌరవ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సంజయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వును తోసిపుచ్చింది. ఈ నెల 31న సంజయ్ కుమార్ మిశ్రా ఈడీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని కోర్టు ఆదేశించింది. ఈలోగా ఈడీ నూతన డైరెక్టర్ నియమకాన్ని పూర్తి చేయాలని కేంద్రానికి సూచించింది.
ఈ నెల 31 వరకు మాత్రమే సంజయ్ మిశ్రాకు ఈడీ డైరక్టర్ గా పదవీ కాలం
సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణం సంజయ్ మిశ్రా ఈ నెల 31న తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ 18 వరకు సంజయ్ మిశ్రా ఈడీ డైరెక్టర్‌గా కొనసాగేవారు. ఈ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరో విషయాన్ని కూడా స్పష్టం చేసింది. సీబీఐ, ఈడీ డైరెక్టర్‌ల నిర్ణాయక రెండేళ్ల పదవీకాలం పూర్తయ్యాక మరో మూడేళ్లపాటు వారి పదవీకాలాలను పొడిగించేలా కేంద్ర ప్రభుత్వానికి అధికారాలను కట్టబెట్టిన చట్టాలకు సవరణలు జరిగిన విషయాన్ని సుప్రీంకరోర్టు గుర్తు చేసింది.
ఈడీ డైరక్టర్ ను మార్చవద్దని కోరిన కేంద్రం - నెలాఖరు వరకే చాన్సిచ్చిన సుప్రీంకోర్టు
2021లో కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడం దారుణమని అభిప్రాయపడింది ధర్మాసనం. గతంలో ఇదే విషయాన్ని స్పష్టం చేసినా ఎందుకని కేంద్రం పట్టించు కోలేదంటూ నిలదీసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక పొడిగించేందుకు ఒప్పుకోమని , కేవలం జూలై 31 వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ - ఎఫ్ఏటీఎఫ్ నిర్వహిస్తున్న పీర్ రివ్యూ మధ్యలో ఉన్నందున ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ చీఫ్‌ను మార్చడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఈడీ చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా జూలై 31 వరకు కొనసాగుతారని సుప్రీం కోర్టు తెలిపింది. అప్పటి వరకు ఆ పదవికి మరో వ్యక్తిని ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
వరుస పొడిగిపులతోనే వివాదం
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రాను 2018 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే సంజయ్ కుమార్ మిశ్రా వయస్సు 2020 నవంబర్ నాటికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో ఆయన అప్పటికి పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈడీ చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడగించింది. ఒక సారి కాదు మూడు సార్లు పొడిగించింది. దీంతో పలువరు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.