అసలే ఎన్నికల సీజన్. ఈ టైంలో అరటి పండుతున్నా రాజకీయా పార్టీలకు పన్ను ఊడే పరిస్థితి ఉంటుంది. అందుకే ఆచితూచి మాట్లాతుంటారు. కొందరైతే ఈ ఎన్నికల సీజన్‌ పూర్తి అయ్యే వరకు మీడియా ఫోన్‌లకు కూడా దూరంగా ఉంటారు. సాధ్యమైనంత వరకు కాంట్రవర్సీలు లేకుండా ఉండాలని చూస్తుంటారు. ఇలాంటి సమయంలో ఎవరైనా నాయకుడు నోరు జారారా అంతే. ప్రత్యర్థులకు చిక్కినట్టే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అలానే ఉంది. 


ఉచిత విద్యుత్‌ పై పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన కామెంట్స్‌ను టైమ్లీగా వాడుకుంది బీఆర్‌ఎస్‌. కర్ణాటక ఎన్నికల తర్వాత జోష్‌ మీద ఉన్న ఆపార్టీ మానసి స్థైర్యం దెబ్బ తీసేందుకు ఈ వ్యాఖ్యలపై దూకుడుగా వ్యూహాన్ని రచించింది. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే రియాక్ట్ అయిన పార్టీ అధినాయకత్వం తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలకు పిలుపునిచ్చింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో విస్తుృతంగా ప్రచారం చేస్తోంది. 


తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అనేది పార్టీలకు బ్రహ్మాస్త్రం లాంటింది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఈ ఉచిత విద్యుత్‌దే కీలక పాత్ర. అప్పటి నుంచి దీన్ని అందిపుచ్చుకున్న పార్టీలు వివిధ రాష్ట్రాల్లో దీన్నో ఓట్ల మంత్ర దండంలా వాడుకుంటున్నాయి. అందుకే దీన్ని చాలా నైస్‌గా డీల్ చేయాలంటారు. అలాంటి సెన్సిటివ్‌ ఇష్యూపై రేవంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. 






రేవంత్ ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భం, చేసిన ప్లేస్‌ వేరు అయినా సరే ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ చేసిన కామెంట్స్‌ను ప్రత్యర్థులు క్యాచ్ చేశారు. వాటిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. బీఆర్‌ఎస్‌ వాటిని  క్షణాల్లోనే దాన్ని వైరల్ చేసింది. రేవంత్‌ చేసిన కామెంట్స్‌ను కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎదుర్కొన్న పరిస్థితులతో వీడియోలు కూడా క్రియేట్ చేసింది. ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు కూడా వ్యతిరేకమంటూ పోస్టర్లు చేసి షేర్ చేసింది. 






రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీకి ఆపాదిస్తూ బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారానికి కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడంలో తడబడిందని అంటున్నారు.  ఒకరిద్దరు చేసిన కామెంట్స్ కూడా ప్రధాన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కాని కనిపించడం లేదు. వారి మాటలను ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించ లేదనే వాదన ఉంది. రేవంత్‌ రెడ్డికి బయట ప్రత్యర్థులకంటే... పార్టీ లోపల ఉన్న ప్రత్యర్థులు ఎక్కువ అని ఆయన సన్నిహితులు చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ కామెంట్స్‌ను వాళ్లకు అందివచ్చిన అవకాశంగా మలుచుకుంటున్నారని టాక్. పార్టీ విజయం కోసం రేవంత్ ఇష్టం లేకున్నా చేతులు కలుపుతున్న నేతలు ఇప్పుడు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  






ఈ కరెంటు మంటలు మాత్రం కాంగ్రెస్‌కు కాస్త ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ చేస్తున్న విమర్శలకు సరైన కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమైందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అన్న ఆసక్తి మాత్రం తటస్తుల్లో కనిపిస్తోంది.