KCR UCC :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించారు. మజ్లిస్ నేతృత్వంలో ముస్లిం సంఘాల ప్రతినిధులు తనతో చర్చలు జరిపినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకిస్తామని హామీ ఇవ్వడమే కాదు.. వారు ప్రగతి భవన్  దాటక ముందే ప్రకటన కూడా విడుదల చేశారు. యూసీసీ అనేది దేశాన్ని చీల్చడానికేనని స్పష్టం చేశారు. ఇది ఓ రకంగా రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మజ్లిస్ ఓ వైపు కాంగ్రెస్ కు దగ్గరవుతోందన్న ప్రచారం జరుగుతోంది. మరో వైవు బీజేపీకి..కేసీఆర్ కి మధ్య అవగాహన కుదిరిందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ చేసిన ప్రకటన... తెలంగాణ రాజకీయాల్లో ఓ మలుపు అనుకోవచ్చు. కానీ కేసీఆర్ బయటకు మాట్లాడకపోవడం.. ప్రకటనలతో సరిపుచ్చడం మాత్రం ఇంకా ఇది నమ్మశక్యమేనా అన్న భావనలో కొంత మంది  ఉన్నారు. 


కేంద్ర బిల్లులను వ్యతిరేకిస్తున్న కేసీఆర్ ! 


కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రెండు వివాదాస్పదమైన బిల్లులకు ఆమోదం పొందాలని అనుకుంటోంది. అందులో ఒకటి ఢిల్లీలో ప్రభుత్వం కన్నా లెఫ్టినెంట్ గవర్నర్ కు ఎక్కువ అధికారాలు కట్టబెట్టడం, దీనిపై ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. రెండోది యూనిఫాం సివిల్ కోడ్. ఇది అత్యంత సున్నితమైన విషయం. ఈ  బిల్లుపై మైనార్టీ వర్గాల్లో ఎన్నో అనుమానాలున్నాయి. బీజేపీ పట్టుదలగా తీసుకు వస్తూండటంతో వారు మరింతగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు బిల్లులనూ వ్యతిరేకిస్తున్న వారు కేసీఆర్ కు మిత్రులే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి బిల్లును వ్యతిరేకించాలని అడిగారు. కేసీఆర్ వ్యతిరేకిస్తామని ప్రకటించారు. యూనిఫాం సివిల్ కోడ్ అంశంలోనూ అంతే. వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. ఈ రెండింటినీ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయినా వ్యతిరేకించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 


పార్లమెంట్ లో వ్యతిరేకంగా ఓటేస్తారా ? బాయ్ కాట్ చేస్తారా ?


రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. మేము వ్యతిరేకిస్తున్నాం అని భీకరకమైన ప్రకటనలు చేస్తేనే వ్యతిరేకించినట్లుగా కాదు. ఇటీవలి కాలంలో బీజేపీతో నేరుగా స్నేహం పెట్టుకోలేని పార్టీలు భిన్నమైన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. బీజేపీ నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. కానీ కీలకమైన ఓటింగ్ జరిగేటప్పుడు మాత్రం బాయ్ కాట్ చేస్తారు. దీని వల్ల బీజేపీకి మేలు చేసినట్లే కానీ.. కీడు చేసినట్లుగా కాదు. గతంలో బీఆర్ఎస్ ఎంపీలు ఇలాగే చేశారు. అయితే ఇప్పుడు కేసీఆర్.. తాను వ్యతిరేకిస్తున్నట్లుగా చెబుతున్న బిల్లులకు ఎంపీలతో  వ్యతిరేకంగా ఓటేయిస్తారా.. లేకపోతే బాయ్ కాట్ చేయిస్తారా అన్నది కీలకం. వ్యతిరేకంగా ఓటేస్తే.. బీజేపీతో లాలూచీ ఏమీ లేదని.. ప్రజలకు గట్టిగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. బాయ్ కాట్ చేస్తే మాత్రం రకరకాల చర్చలు జరుగుతాయి. ఎందుకంటే బీఆర్ఎస్‌కు రాజ్యసభలో ఏడుగురు సభ్యులున్నారు. వారి ఓటింగ్ కీలకం అయ్యే అవకాశం ఉంది. 
 


బీజేపీతో మళ్లీ యుద్ధానికి రెడీ అవుతున్నారా ?


కారణం ఏమిటన్నది ఎవరికీ తెలియదు కానీ.. కేసీఆర్ ఇటీవల బీజేపీ, మోదీపై విమర్శలు చేయడం లేదు. ప్రకటనల్లో.. వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కానీ నేరుగా ఆయన ఎలాంటి విమర్శలు చేయడం లేదు. స్వయంగా మోదీ తెలంగామకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేసినా..  కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టలేదు. కౌంటర్ ఇవ్వలేదు. కానీ వారి కీలకమైన బిల్లులను మాత్రం వ్యతిరేకిస్తున్నామంటున్నారు. బీఆర్ఎస్‌తో లాలూచీ అనే ప్రశ్నే లేదని.. ముందు ముందు జరిగే పరిణామాలను మీరే చూస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. మరి రాజకీయ పరిణామాలను ఈ రెండు పార్టీలు మార్చేస్తాయా ? లేకపోతే.. ఇలాగే బయటకు కనిపించకుండా యుద్ధం చేస్తాయా అన్నది  మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.