Chandrayaan-3: చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రునికి మరింతగా చేరువైంది. బుధవారం రోజు కక్ష్య మార్పుతో ప్రస్తుతం చంద్రయాన్-3.. 174 కి.మీ X 1,437 కి.మీ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. తదుపరి కక్ష్య మార్పు ఆగస్టు 14వ తేదీన ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య జరగనుంది. సోమవారం, ఇస్రో చంద్రయాన్-3 ఎత్తును దాదాపు 14 వేల కిలోమీటర్ల మేర తగ్గించింది. ఆగస్టు 16వ తేదీన చంద్రయాన్-3 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆగస్టు 17న ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్) లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విడిపోనుంది. 


ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయిన తర్వాత, ఇస్రో ల్యాండింగ్ మాడ్యూల్ ను పెరిలున్ (చంద్రునికి అత్యంత సమీపంలోని స్థానం) 30 కిలోమీటర్లు, అపోలూన్ (చంద్రునికి దూరమైన స్థానం) 100 కిలోమీటర్ల కక్ష్యలోకి డీ-బూస్ట్ చేస్తుంది. చివరి ల్యాండింగ్ ఈ కక్ష్య నుంచి జరగనుంది. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే ఈనెల 23న చంద్రయాన్ చంద్రుడిపై దిగుతుంది. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్, అన్ని సెన్సార్లు, దాని రెండు ఇంజిన్లు పని చేయకపోయినా ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండింగ్ చేయగలదని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్న విషయం తెలిసిందే.


మంగళవారం బెంగళూరులోని దిశా భారత్ ఎన్జీవో సంస్థ ఏర్పాటు చేసిన చంద్రయాన్-3: భారత్స్ ప్రైడ్ స్పేస్ మిషన్ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పాల్గొని చంద్రాయన్-3 కి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్, అన్ని సెన్సార్లు, దాని రెండు ఇంజిన్లు పని చేయకపోయినా ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండింగ్ చేయగలదని అన్నారు. అన్ని రకాల వైఫల్యాలను తట్టుకునేలా ల్యాండర్ 'విక్రమ్' డిజైన్ చేశామన్నారు. ఇది ఫెయిల్యూర్ విధానంలో పని చేస్తుందన్నారు. అంతా విఫలమై, అన్ని సెన్సార్లు ఆగిపోయినా, ఏమీ పని చేయకపోయినా, ప్రొపల్షన్ సిస్టమ్ ఒక్కటి బాగా పనిచేస్తే విక్రమ్ ల్యాండింగ్ చేస్తుందన్నారు. ఫెయిల్యూర్ విధానంలో రూపొందించినట్లు చెప్పారు. జూలై 14న అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. దానిని చంద్రునికి దగ్గరగా తీసుకురావడానికి మరో మూడు డీ ఆర్బిటరీ విన్యాసాలు జరగాల్సి ఉంది. అన్ని కసరత్తుల తరువాత ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండింగ్ అవుతుంది. ఆగస్టు 9, ఆగస్టు 14, ఆగస్టు 16 తేదీల్లో నిర్వహించే డీ ఆర్బిటరీ విన్యాసాల ద్వారా చంద్రయాన్ చంద్రుడి నుంచి  100 కిమీx 100 కిమీల దూరం వరకు తగ్గిస్తారని సోమనాథ్ వివరించారు. 


Also Read: Coffee Beans Shortage: కాఫీ గింజల కొరత, అంతర్జాతీయంగా పెరుగుతున్న కాఫీ ధరలు


ల్యాండర్ ప్రొపల్షన్ మాడ్యూల్ సెపరేషన్ ఎక్సర్‌సైజ్ ల్యాండర్  డీబూస్ట్  తర్వాత వెంటనే చేపడతామని, ఈ ప్రక్రియ ల్యాండర్ వేగాన్ని తగ్గిస్తుందన్నారు. ఆ తర్వాత ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుందని ఆయన వివరించారు. ఈసారి కూడా ల్యాండర్ విక్రమ్‌లో రెండు ఇంజన్లు పని చేయకపోయినా, ఇంకా ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.  అల్గారిథమ్‌లు సరిగ్గా పనిచేస్తే విక్రమ్ అనేక వైఫల్యాలను విజయవంతంగా ఎదుర్కొంటుందని నిర్ధారించుకునేలా డిజైన్ చేసినట్లు ఆయన వివరించారు.