Chandrayaan 3: భారత్ మరోసారి చంద్రుడిపైకి వెళ్లేందుకు సిద్ధమైంది. మరో వారంలో చంద్రయాన్-3ను ఇస్రో ప్రయోగించబోతోంది. చంద్రుడిపైకి భారత్ వ్యోమనౌకను పంపుతున్న మూడో ప్రయోగం. చంద్రయాన్-2 కు ఇది కొనసాగింపుగా ఇస్రో చేపడుతోంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగాయి. జులై 13వ తేదీన చంద్రయాన్ -3 ప్రయోగాన్ని చేపట్టేందుకు అన్ని సిద్ధం చేస్తోంది ఇస్రో. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోట స్పేస్ సెంటర్ నుంచి ఈ మిషన్ ను శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు. అయితే తాజాగా ఈ ప్రయోగంలో భాగంగా చంద్రయాన్-3 ని జీఎస్ఎల్వీ-ఎంకే III (జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ మార్క్ III) తో అనుసంధానించారు.






శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో భారతదేశ అత్యంత బరువైన రాకెట్ తో పేలోడ్ ఫెయిరింగ్ ను అనుసంధానించారు. చంద్రయాన్-3 ప్రయోగం జులై 13వ తేదీన ఆరోజు పరిస్థితులు అనుకూలించకపోతే 19వ తేదీ వరకు ప్రయోగిస్తామని, చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి తీరుతామని ఇస్రో చీఫ్ ఎన్ సోమనాథ్ ఇటీవల ప్రకటించారు. జులై 12 నుంచి 19వ తేదీ వరకు సరైన కాలమని, కక్ష్య డైనమిక్స్ ప్రకారం చంద్రునిపైకి ప్రయాణించడానికి తక్కువ ఇంధనంతో అధిక సామర్థ్యంతో వెళ్లవచ్చని తెలిపారు. జులై 13వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రయోగం నిర్వహిస్తే.. చంద్రుడిపై ఆగస్టు 23న ఈ వ్యోమనౌక ల్యాండ్ అవుతుంది.






సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా నిలవనున్న భారత్


చంద్రయాన్-3 మిషన్ లోని వ్యోమనౌక 2 నెలల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసి చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఇస్రో ఇంతకు ముందు కూడా జాబిలిపై అడుగు పెట్టింది. 2008 అక్టోబర్ లో చంద్రయాన్-1 మిషన్ ద్వారా చంద్రుడిపై అడుగు పెట్టగలిగింది. అయితే చంద్రుడిపై దిగడం సవాళ్లతో కూడుకున్నది. చంద్రయాన్-2 మిషన్ పేరుతో 2019లో ఇస్రో చేపట్టిన ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. అప్పుడు చంద్రయాన్ ల్యాండర్, రోవర్ రెండూ క్రాష్ అయ్యాయి. ప్రస్తుతం చేపడుతున్న ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషిస్తుంది. చంద్రుని ఉపరితలంపై మృదువైన ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తారు. ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైతే.. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది.


చంద్రయాన్-3 లక్ష్యం ఏంటి?


చంద్రయాన్03 ప్రయోగానికి దాదాపు రూ.615 కోట్లు ఖర్చు అవుతుంది. దీని కోసం ఇస్రో మూడు లక్ష్యాలను నిర్దేశించింది. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా సాఫ్డ్ ల్యాండింగ్ కావడం, చంద్రుడిపై తిరిగే ఒక రోవర్ ను ప్రయోగించడం, చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడం లాంటి మూడు లక్ష్యాలను ఇస్రో పెట్టుకుంది. చంద్రయాన్-2 తరహాలోనే చంద్రయాన్-3లో కూడా ఒక ల్యాండర్, ఒక రోవర్ ఉంటాయి. చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కాగా.. దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఈ ప్రయోగాన్ని చేపడుతోంది ఇస్రో. చంద్రుడిపై ప్రకంపనలను గుర్తించే సైస్మోమీటర్ సహా కొన్ని పరికరాలను ప్రస్తుత వ్యోమనౌకలో పంపించనున్నారు. వీటి సాయంతో చంద్రుడి ఉపరితలంపై వాతావరణం, ఉష్ణోగ్రతలపై కూడా అధ్యయనం చేపట్టే అవకాశం ఉంటుంది.