Chandrayaan-3: భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ లోని అత్యంత కీలకమైన దశ మరికొన్ని నిమిషాల్లో మొదలు కానుంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టే క్షణం కోసం యావత్ భారతావనితో పాటు ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. చంద్రయాన్-3 సక్సెస్ కావాలంటూ సోషల్ మీడియా యూజర్లు పోస్టులు పెడుతున్నారు. అయితే తాజాగా చంద్రయాన్-3 మిషన్ పై టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు.
న్యూస్ థింంక్ అనే ట్విట్టర్ హ్యాండిల్.. చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్(75 మిలియన్లు) హాలీవుడ్ మువీ ఇంటర్‌స్టెల్లార్ (165 మిలియన్లు) కంటే తక్కువ అని తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై ఎలన్ మస్క్ స్పందించారు. 'గుడ్ ఫర్ ఇండియా' అని ట్వీట్ చేశారు.
చంద్రునిపై ల్యాండింగ్‌లో ముఖ్య విషయాలు
ల్యాండింగ్ సమయం
MOX/ISTRAC వద్ద ల్యాండింగ్ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5.20 గంటలకు ప్రారంభమవుతుందని ఇస్రో తెలిపింది. సాయంత్రం 6.04 గంటల సమయంలో దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో రోవర్‌తో ల్యాండర్‌ను టచ్-డౌన్ చేయడానికి ముందుగా నిర్ణయించారు. మొత్తం ల్యాండింగ్ ప్రక్రియకు దాదాపు 30 నిమిషాలు పట్టవచ్చని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఆయన మాట్లడుతూ.. కచ్చితమైన కాలక్రమం, సిస్టమ్‌లు, ల్యాండింగ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందన్నారు. మొదట కనిపించే సైట్‌లో దిగాలా లేక మరో సురక్షిత ప్రాంతంలో దిగాలా అనేది అప్పుడు నిర్ణయిస్తామన్నారు. ఎటుంటి ప్రమాదం లేకుండా సురక్షితమైన స్థలాన్ని ఎంచుకుని ల్యాండర్‌ను దించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
విక్రమ్ ఫంక్షన్
చంద్రయాన్-3లో కీలకంగా ఉన్న విక్రం ల్యాండర్ పనితీరు ఇప్పటివరకు అద్భుతంగా ఉంది. మునుపటి వైఫల్యం నుంచి నేర్చుకుంటూ విక్రమ్ ల్యాండర్‌ను శక్తివంతంగా ఇస్రో శాష్త్రవేత్తలు తీర్చిదిద్దారు. ఈసారి 10.8 kmph వరకు ల్యాండింగ్ వేగాన్ని తట్టుకోనేలా దృఢంగా తయారు చేశారు. విక్రమ్ పనితీరు సజావుగా సాగుతోంది. ఇప్పటి వరకూ యుఎస్, రష్యా చైనా చంద్రునిపై ప్రయోగాలకు స్పేస్ క్రాఫ్ట్‌లను పంపాయి. కానీ ఇండియా మాత్రమే దక్షిణ ధృవంపై దిగేలా ప్రయోగం చేపట్టింది.
ఇది విజయవంతమైతే, చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కుతుంది. అలాగే చంద్రుడిపై విజయవంతంగా దిగిన నాలుగోదేశంగా రికార్డులకెక్కుతుంది. విక్రం ల్యాండింగ్ తర్వాత రోవర్ ప్రజ్ఞాన్ సురక్షితంగా దిగేందుకు ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తుంది.. ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలాన్ని అన్వేషించి అధ్యయనాలను మొదలు పెడుతుంది. ల్యాండర్ రోవర్ ఒక చంద్ర రోజు (భూమిపై 14 రోజులు) పని చేసేలా రూపొందించబడ్డాయి.
సవాళ్లు
విక్రం ల్యాండింగ్ సవాళ్లతో కూడుకుంది. చంద్రుడిపై ఎక్కవ ధూళి ఉంటుంది. ఉపరితలానికి దగ్గరగా ఆన్‌బోర్డ్ ఇంజిన్‌లను కాల్చడం ద్వారా వేడి వాయువులు, ధూళి వెనుకకు వెళ్తాయి. చంద్ర ధూళి సోలార్ ప్యానెల్, ఇతర సాంకేతిక మిషన్ల పనితీరుకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ ప్రకారం.. చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించడంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఆగస్ట్ 23న ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి దిగేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో దాని వేగం సెకనుకు 1.68 కిమీ ఉంటుంది. ఆ వేగాన్ని తగ్గించడంపైనే ఇస్రో దృష్టి ఉంటుందని ఆయన తెలిపారు. ఎందుకంటే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ల్యాండర్ వేగంపై ప్రభావం చూపుతుందన్నారు.