Central Govt on Deepfakes:
డీప్‌ఫేక్ వీడియోలను (Deepfake Videos) సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇప్పుడా ఆయా ప్లాట్‌ఫామ్స్ ప్రతినిధులతో భేటీ అయింది. డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించడంతో పాటు వాటిని పూర్తి స్థాయి కట్టడి చేయాలని కేంద్రం ఆదేశించింది. మరో పది రోజుల్లో ఈ చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. టెక్నాలజీకి ఇదో సవాల్ విసురుతోందని అసహనం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు రెగ్యులేషన్స్ (Regulation on Deepfakes) తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. అవసరమైతే కొత్త చట్టం చేయడానికై వెనకాడమని స్పష్టం చేశారు. ఉన్న చట్టాల్లో సంస్కరణలు చేసైనా డీప్‌ఫేక్‌ని అడ్డుకుంటామని తెలిపారు.
"సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ప్రతినిధులతో డీప్‌ఫేక్‌పై కీలక చర్చలు జరిగాయి. వచ్చే 10 రోజుల్లో ఇలాంటి వీడియోలను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు అవసరమైన రెగ్యులేషన్స్‌ని తీసుకొచ్చేందుకు అంతా అంగీకరించారు. సమాజానికి హాని చేసే ఇలాంటి టెక్నాలజీపై కచ్చితంగా దృష్టి పెడతాం. ఈ టెక్నాలజీని కట్టడి చేయాలన్న వాదనకు ప్రతినిధులందరూ మద్దతు తెలిపారు. ప్రస్తుతానికి రెగ్యులేషన్స్ అన్నీ డ్రాఫ్ట్ దశలో ఉన్నాయి. త్వరలోనే వీటిని వెల్లడిస్తాం"
- అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఐటీ మంత్రి
డీప్‌ఫేక్ వీడియోలను ఆటోమెటిక్‌గా గుర్తించేలా చర్యలు చేపట్టేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అంగీకరించినట్టు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకోసం చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు కసరత్తు జరుగుతోందని వివరించారు.
"కొత్త చట్టం తీసుకురావడమా..? ఉన్న చట్టాల్లో మార్పులు చేయడమా..? అనే దానిపై కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు డీప్‌ఫేక్‌పై పూర్తిస్థాయిలో కట్టడి తీసుకొస్తాం. దీనిపై అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సానుకూలంగా స్పందించాయి. నా వాదనలతో ఏకీభవించాయి. డీప్‌ఫేక్ వీడియోలను ఆటోమెటిక్‌గా గుర్తించే టెక్నాలజీస్ ఉన్నాయని వాళ్లు వివరించారు" -
అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఐటీ మంత్రి