One Nation One Election:
ఒకే దేశం..ఒకే ఎన్నిక..
ఒకే దేశం..ఒకే ఎన్నిక. ఎన్నో ఏళ్లుగా బీజేపీ ఈ నినాదం వినిపిస్తోంది. జమిలీ ఎన్నికల నిర్వహణపై కసరత్తులు చేస్తోంది. సాధ్యాసాధ్యాలపై చాలా చర్చలు జరిపిన తరవాత చివరకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 18-22 వరకూ ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిన కేంద్రం...జమిలి ఎన్నికలపై చర్చించేందుకు సిద్ధమవుతోంది. కోవింద్ నేతృత్వంలోని ఈ కమిటీలో రిటైర్డ్ జడ్జ్‌లు, మాజీ కేబినెట్ సెక్రటరీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో పాటు రిటైర్డ్ ఎలక్షన్ కమిషనర్, నిపుణులు ఉంటారు. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో One Nation, One Election బిల్‌ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. దీంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్, యునిఫామ్ సివిల్ కోడ్ బిల్‌నీ ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. అయితే...అధికారికంగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటి వరకూ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు వేరువేరుగా జరుగుతున్నాయి. సాధారణంగా రాష్ట్రాల్లో ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ ఈ ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్ పాస్ అయితే..రాష్ట్రాలకు, లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ బిల్ పాస్ అవ్వాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. లోక్‌సభ సభ్యుల్లో 67% మంది, రాజ్యసభ సభ్యుల్లో 67% మందితో పాటు రాష్ట్రాల అసెంబ్లీలో 50% మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు భారీగా తగ్గుతుందని చెబుతోంది కేంద్రం. అంతే కాదు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందూకు వీలవుతుందని వివరిస్తోంది. ఇదే సమయంలో యునిఫామ్ సివిల్ కోడ్ (Uniform Civil Code)బిల్‌నీ ప్రవేశపెట్టాలని భావిస్తోంది మోదీ సర్కార్. ఎన్నికలకు ముందే ఈ హామీని నెరవేర్చుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే...దీనిపై ఇప్పటికే విపక్షాలు మండి పడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ UCC బిల్‌పై స్పందించారు. కేంద్రం డ్రాఫ్ట్ బిల్ తీసుకొస్తోందని,ఈ బిల్‌పై పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. అందులో ఎలాంటి నిబంధనలున్నాయో ఎవరికీ తెలియదని, ఏ వర్గం వాళ్లు ఈ కోడ్ వల్ల నష్టపోతారన్నది చూడాల్సి ఉందని అన్నారు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్ 90వ దశకం నుంచి పెండింగ్‌లో ఉంది. పార్లమెంట్‌లో చాలా సందర్భాల్లో ఈ బిల్ ప్రవేశపెట్టినా...పాస్ అవ్వలేదు. అయితే...ఈ మధ్య మళ్లీ దీనిపై చర్చ మొదలైంది. BRS MLC కవిత ఈ డిమాండ్ వినిపిస్తున్నారు. ఢిల్లీలో ఒకరోజు దీక్ష కూడా చేశారు. మరి కొన్ని పార్టీలూ డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఈ బిల్‌ని ప్రవేశపెట్టనుందన్న ఊహాగానాలు ఆసక్తి పెంచుతున్నాయి.
Also Read: China New Map: చైనాకు ఎదురుదెబ్బ, కొత్త మ్యాప్‌ను తిరస్కరించిన మరో నాలుగు దేశాలు