Live TV: సాధారణంగా మొబైల్లో టీవీ చూడాలంటే ఇంటర్నెట్ ఉండాలి. ఇండియాలో స్మార్ట్ ఫోన్ ఉన్న వ్యక్తి సగటున రోజుకు 1.5 జీబీ డేటా వాడేస్తున్నాడు. ఉన్న డేటా అంతా టీవీ చూడటానికే అయిపోతే ఇతర అవసరాలకు ఏం వాడుకోవాలి? ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేయాలి, యూట్యూబ్ చూడాలి, క్రికెట్ మ్యాచ్‌లు ఉన్నప్పుడు అయితే మరీ కష్టం. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఆలోచిస్తోంది. ఇంటర్నెట్ లేకుండా టీవీ సేవలు అందించేందుకు యత్నిస్తోంది.


మామూలుగా మనం టీవీ చూడాలంటే కేబుల్ టీవీ ఆపరేటర్, డైరెక్ట్ టు హోం కనెక్షన్లను ఏర్పాటు చేయించుకుంటాం. కాలం మారే కొద్ది ఓటీటీ యాప్స్‌లో లైవ్ టీవీ వచ్చేస్తోంది. అయితే ఇందుకోసం ఇంట్లో వైఫై ఉంటే సరే. లేని వారి పరిస్థితి ఏంటి? ఫోన్‌లో ఉన్న డేటా అంతా అయిపోయినట్లే. వాటన్నింటికి పరిష్కారం చూపిస్తూ ఇంటర్నెట్ లేకుండా నేరుగా మొబైల్లో టీవీ చూసేలా కేంద్రం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టింది.


లైవ్ టీవీ ఛానెల్‌లను నేరుగా మొబైల్ ఫోన్‌లకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాన్ని పరిశీలిస్తోంది. డైరెక్ట్-టు-హోమ్ (DTH) సేవల తరహాలో  "డైరెక్ట్-టు-మొబైల్" (D2M) ద్వారా ఈ సేవలు అందించేందుకు అడుగులు వేస్తోంది. ఈ సాంకేతికతతో మొబైల్ ఫోన్‌లో డేటా కనెక్షన్ అవసరం లేకుండా వినియోగదారులు తమ మొబైల్‌లలో టీవీ చూడొచ్చు. వినియోగదారును ఆకట్టుకునేలా ఈ డైరెక్ట్ టు మొబైల్ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB), IIT-కాన్పూర్ ఈ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.  


ఇది సాధ్యమయ్యే అవకాశం ఉన్నా.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సాంకేతికతతో తమకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న డేటా ప్లాన్ల ద్వారా ఆదాయం తగ్గిపోతుందని, నష్టం జరుగుతుందనే భయాన్ని టెలికం ఆపరేటర్లు, వారితో పాటు డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ ఆపరేటర్లు వ్యక్తం చేయొచ్చు. ఈ ఆలోచనలను వారు తిరష్కరించే అవకాశం ఉంది. వీడియోలు చూడడం ద్వారా డేటా వేగంగా అయిపోతుంది. దీంతో వినియోగదారులు మరో సారి రీచార్జ్ చేసుకోవడం ద్వారా టెలికం సంస్థలు ఆదాయం ఆర్జిస్తున్నాయి. అయితే  ఈ D2M విధానంతో వారి ఆదాయ మార్గాలపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా 5G వ్యాపార వ్యూహాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన టెలికం ఆపరేటర్ల నుంచి వ్యక్తం అవుతోంది. 


దీనిపై ఓ అధికారి స్పందిస్తూ.. డైరెక్ట్ టు మొబైల్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాట్లు చెప్పారు. దీనిపై టెలికాం ఆపరేటర్లతో సహా అన్ని వాటాదారులతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాబోయే సమావేశంలో DoT, MIB, IIT-కాన్పూర్, టెలికాం, ప్రసార రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నారు. ఇది సాద్యమైతే భారత దేశంలో మరో సాంకేతిక విప్లవం దిశగా అడుగులు చేసినట్లు అవుతందని ఆయన అభిప్రాయపడ్డారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial