క్రిమినల్ చట్టాల( Criminal Acts )ను మార్చే మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం (Central Government) లోక్‌సభ(Loksabha)లో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ కమిటీ (Parliamentary Committee )సిఫారసులతో కూడిన కొత్త ముసాయిదా బిల్లులను తీసుకొచ్చింది. క్రిమినల్ చట్టాలను మార్చే మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం ఉపసంహరించుకున్నారు. భారతీయ న్యాయ సంహిత-2023, ది భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023లను అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ నెల 14న బిల్లుల చర్చ జరుగుతుందని.. 15న చర్చలో సమాధానాలు ఇవ్వనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సిఫారసులను పొందుపరిచేందుకు అనేక సవరణలను తీసుకువచ్చేందుకు బదులుగా...మార్పులను చేస్తూ కొత్త బిల్లులను తీసుకురావాలని నిర్ణయించింది. బిల్లులుపై గురువారం చర్చ ఉంటుందని.. శుక్రవారం ఓటింగ్ జరుగుతుందని అమిత్ షా విపక్ష సభ్యులకు తెలిపారు. పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కొత్త బిల్లుల్లో... పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సూచనలను పొందుపరిచారు.
డిజిటల్ సాక్ష్యాలను భద్రపరచడానికి కొత్త CrPC బిల్లులోని నిబంధనలను కూడా ప్యానెల్ సిఫార్సు చేసింది. అరెస్టు చేసిన 15 రోజులకు మించి పోలీసు కస్టడీని అనుమతించే నిబంధనపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్ విధివిధానాలను రాష్ట్రాలకే వదిలేయాలని కూడా సూచించింది. గత నెలలో, హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వివిధ మార్పులను సూచిస్తూ ప్రతిపాదిత బిల్లులపై తన నివేదికలను సమర్పించింది. వ్యభిచారాన్ని నేరంగా పరిగణించే నిబంధనను- 2018లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. లింగ నిర్దారణను తటస్థ రూపంలో ప్రవేశపెట్టాలని కమిటీ సిఫార్సు చేసింది. ఏకాభిప్రాయం లేని స్వలింగ సంపర్క చర్యలను నేరంగా పరిగణించేందుకు సెక్షన్ 377 IPC లాంటి నిబంధనను కొనసాగించాలని కూడా ఇది సిఫార్సు చేసింది. అయితే మూడు బిల్లులను అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ముసాయిదా చట్టాలను అధ్యయనం చేసేందుకు సభ్యులకు 48 గంటల సమయం ఉండేలా బిల్లులను మంగళవారం ప్రవేశపెట్టినట్లు కేంద్రం వెల్లడించింది.
ప్రధానంగా ఐదు విభాగాల్లో మార్పులు చేసినట్లు చెప్పిన కేంద్రం... వ్యాకరణం, భాషకు సంబంధించిన మార్పులు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ బిల్లు, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ మూడు బిల్లులను జాయింట్ కమిటీకి పంపాలన్న సూచనలను షా తిరస్కరించారు. మూడు బిల్లులపై చర్చకు మొత్తం 12 గంటల సమయం ఇచ్చినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న బ్రిటిష్ కాలానికి చెందిన ఇండియన్ పీనల్ కోడ్-ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ చట్టాలను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యం చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం బిల్లును సభ ముందుకు తీసుకువచ్చింది. ఆ తర్వాత వాటిని పార్లమెంట్ కమిటీ పరిశీలనకు పంపింది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ఆయా బిల్లులను ఆమోదింపజేసేలా చర్యలు తీసుకుంటోంది. కొత్త చట్టాల్లో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. ఇందులో తీవ్రవాద నిర్వచనాన్ని సైతం మార్చింది. ఆర్ధిక అంశాల్లో జరిగే నేరాలను కూడా తీవ్రవాదంగా పరిగణిస్తూ మార్పు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.