సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) మరణానికి వారం రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్‌ దిశా సాలియన్‌ (Disha Salian) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఈ వ్యవహారం 2020లో సంచలనం రేపింది. మహారాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దిశా సాలియన్‌ మృతిపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ముంబయి పోలీసులు మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. మాల్వాని పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ చిమాజీ అధవ్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతుందని, డీసీపీ అజయ్ బన్సల్ విచారణను పర్యవేక్షించనున్నారు. 


ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య
28 ఏళ్ల దిశా సాలియన్...జూన్ 8 2020న ముంబయిలోని ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసు మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం ఈ కేసును కప్పిపుచ్చేందుకు యత్నించిందనే ఆరోపణలు వచ్చాయి. హత్య, అత్యాచారంతోపాటు సుశాంత్‌ మృతితోనూ ముడిపెడుతూ ప్రచారం జరిగింది. ఆదిత్య ఠాక్రే, ఉద్ధవ్‌ ఠాక్రేలతో ఉన్న విరోధం కారణంగా...బీజేపీ నేతలు వారి రాజకీయ వైరంలోకి లాగారు. తమ జీవితాలను దుర్భరంగా మార్చారంటూ దిశా సాలియన్‌ తల్లిదండ్రులు వాపోయారు. 


తన కుమార్తె పేరును రాంగ్‌ డైరెక్షన్‌లో ఉపయోగిస్తున్నారు
రాజకీయ కారణాలతో తన కుమార్తె పేరును ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తున్నారని దిశా సాలియన్ తల్లిదండ్రులు...అప్పట్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. నిత్యం తమకు ఎదురవుతోన్న వేధింపులతో తమ జీవితం దారుణంగా మారిందని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ చుట్టూ జరుగుతోన్న పరిస్థితులతో తమ జీవితాలను ముగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు లేఖలో ప్రస్తావించారు. తమ కుమార్తె పేరును చెడుగా ఉపయోగించకుండా ఉండేలా చూడాలని దేశంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇదే పిటిషన్‌ను ప్రధానమంత్రి, హోం మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌, ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపారు. 


రాజకీయ వైరంలోకి తమను లాగారు
తమ కుమార్తె మరణం, ఆ తర్వాత చోటుచేసుకున్న సుశాంత్‌ మృతితో ముడిపెట్టడంపై తల్లిదండ్రులు దిశా సాలియన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిత్య ఠాక్రే, ఉద్ధవ్‌ ఠాక్రేతో ఉన్న విరోధం కారణంగా నారాయణ్ రాణె, నితేశ్ రాణె ఈ విషయంలో తలదూర్చారు. వారి రాజకీయ వైరంలోకి తమను లాగారని.... తమ జీవితాలను దుర్భరంగా మార్చారని వాపోయారు. నారాయణ్‌, నితేశ్‌ మాత్రం కొందరు వ్యక్తులు దిశ గదిలోకి ప్రవేశించి, అత్యాచారం చేశారని చెబుతూనే ఉన్నారని.... ఇవి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలని ఆవేదన వ్యక్తం చేశారు. వారి తప్పుడు ఆరోపణలతో తన కుమార్తె వ్యక్తిత్వాన్ని కించపర్చడం మమ్మల్ని తీవ్రంగా గాయపర్చిందన్నారు.