పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి అయిన బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆధ్వర్యంలో శనివారం బాబుల్ సుప్రియో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం పార్టీలోకి బాబుల్ సుప్రియోను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లుగా టీఎంసీ పార్టీ ట్వీట్ చేసింది. ఆయన పార్టీలో చేరిన చిత్రాలను తృణమూల్ కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ద్వారా ట్వీట్ చేసింది.
అసన్‌సోల్ పార్లమెంటు నియోజకవర్గం ఎంపీ అయిన బాబుల్ సుప్రియోకు బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా పని చేశారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి పక్కన పెట్టారు. దీంతో తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు.
బీజేపీ నుంచి బయటకు రాగానే బాబుల్ సుప్రియో అప్పట్లోనే తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండబోనని తర్వాత ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భవానీ పూర్ సహా మూడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బాబుల్ సుప్రియో పేరు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బాబుల్ సుప్రియో బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రత్యర్థి పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పటికే ముకుల్ రాయ్ సహా పలువురు బీజేపీ నేతలు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు బాబుల్ రూపంలో మరో కీలక నేత కూడా బీజేపీని వీడుతుండడం ఆ పార్టీకి షాక్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు..