పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతోనే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు.


క్రైసిస్ ఇలా..


కొంత కాలంగా సీఎం అమరీందర్ వర్సెస్ సిద్దూ అన్నట్లుగా సాగుతున్న పంజాబ్ కాంగ్రెస్ రాజకీయం ఈ రోజు కొత్త మలుపు తీసుకుంది. ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ రాజీనామా చేశారు. కొంత కాలంగా సిద్దూ వ్యవహార శైలితో తాను విసిగిపోయానంటూ అమరీందర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారు.


ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ హై కమాండ్ సిద్దూకు పంజాబ్ పీసీసీ బాధ్యతలు అప్పగించింది. పదవి ఇచ్చినా.. ఎమ్మెల్యేలతో సిద్దూ తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసి.. తనపై వ్యతిరేక ప్రచారం.. చేశాడనేది అమరీందర్ సింగ్ ఆగ్రహం. ఇలాంటి పరిస్థితులను పెట్టుకుని.. సీఎంగా కొనసాగడం కష్టమేననే ఆలోచనలో అమరీందర్ ఉన్నట్టు అర్థమవుతోంది. అదేకాకుండా కొంత మంది ఎమ్మెల్యేలు సీఎంగా అమరీందర్ ను తప్పించాలంటూ.. సోనియాకు లేఖ రాసినట్లు సమాచారం.


ఒకవైపు .. అమరీందర్ సింగ్.. అసహనం వ్యక్తం చేస్తున్న సమయంలో మరోవైపు సీఎల్పీ సమావేశం జరుగుతుండటంపై ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి అమరీందర్‌ చేరుకోవాల్సిన లక్ష్యాల పురోగతిపై సమీక్ష జరగనున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిణామాలతో అమరీందర్‌ సింగ్‌ ఇంకా విసిగిపోయరట. తన అసంతృప్తిని ఆయన నేరుగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందు వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీఎం మార్పు జరుగుతోందంటూ కొంత కాలంగా వార్తలు రావడం తనకు అవమానకరంగా ఉందని సోనియా ముందు వాపోయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఇలాంటి పరిస్థితుల్లో సీఎల్పీ సమావేశంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.


అమరీందర్ కేబినెట్ లోని నలుగురు మంత్రులు సహా డజను మంది ఎమ్మెల్యేలు పార్టీ అధినాయకత్వానికి సీఎం ను మార్చాలంటూ లేఖ రాశారు. ఎన్నికల హామీలను అమలు చేయటంలో అమరీందర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో గెలవాలంటే ముందుగా సీఎం ను తప్పించాలని వారు కోరుతున్నారు. ఈ కారణంగానే సీఎల్పీ సమావేశం జరుగుతుందనే వాదన వెళ్లింది.  అమరీందర్ సమావేశానికి ముందుగానే రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. సీఎల్పీ సమావేశంలో తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకొనే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ముందు పంజాబ్ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 


Also Read: Jogi Ramesh : అయ్యన్న వ్యాఖ్యలపై జోగి రమేష్ ఒక్కరే ఎందుకు స్పందించారు ? వ్యూహమా ? రాజకీయమా ?