Bike Taxi Ban: ఒకప్పుడు ట్యాక్సీలు అంటే కార్లే. ఎక్కడికైనా వెళ్లాలంటే.. బస్సులు, ఆటోలు లేదంటే కార్లు. హైదరాబాద్ లాంటి నగరాల్లో మారుమూల ప్రాంతాలకు బస్సు సేవలు ఎలాగూ ఉండవు. అవి కేవలం ప్రధాన రోడ్ల వరకే పరిమితం. గల్లీల్లోకి వెళ్లాలంటే ఆటోలు, కార్లను ఆశ్రయించాల్సిందే. ఆటోలు, కార్లలో ప్రయాణించాలంటే రేటు తడిసి మోపెడవుతుంది. ఒక్కరున్నా అదే ధర, ముగ్గురు నలుగురు ఉన్నా అదే ధర చెల్లించాల్సిందే. ఇలాంటి సమస్యలు అన్నింటికీ పరిష్కారం బైక్ ట్యాక్సీలు వచ్చాయి. చిన్న చిన్న గల్లీల్లోకి కూడా సులభంగా వెళ్లే వీలు, పెద్దగా ట్రాఫిక్ సమస్యలు లేకుండానే గమ్యస్థానానికి వెళ్లే సౌకర్యం ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉండటంతో కొంత కాలంలోనే బైక్ ట్యాక్సీలు సూపర్ గా క్లిక్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా చాలా నగరాల్లో ఈ బైక్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ ట్యాక్సీ సేవలు దేశంలో ప్రధానంగా ర్యాపిడో, ఉబెర్ లాంటి కొన్ని అగ్రిగేటర్లు సేవలు అందిస్తున్నాయి. తాజాగా వీటికి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.


హైకోర్టు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్‌కు సుప్రీం కోర్టు స్టే


దేశరాజధాని ఢిల్లీలో బైక్ ట్యాక్సీ సేవలు అందిస్తున్న ర్యాపిడీ, ఉబెర్ లకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఈ సంస్థలు అందిస్తున్న సేవలను నిషేధిస్తూ గతంలో ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ర్యాపిడో, ఉబెర్ హైకోర్టుకు వెళ్లగా.. బైక్ ట్యాక్సీ సేవలకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. తాజాగా.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 


'బైక్ ట్యాక్సీ సేవలు చట్టాన్ని ఉల్లంఘించడమే'


ర్యాపిడో, ఉబెర్ సంస్థలు మోటార్ వాహనాల చట్టం- 1988 ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ప్రభుత్వం బైక్ ట్యాక్సీ సేవలను నిషేధించింది. ద్విచక్ర వాహనాలేతర రవాణాపై పరిపాలన ద్వారా తుది విధానాన్ని ప్రకటించే వరకు బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్లు, ర్యాపిడో, ఉబెర్ లను దేశ రాజధాని ఢిల్లీలో తమ సర్వీసులు నిలిపి వేయాలని తెలిపింది. దీనిపై ర్యాపిడో, ఉబెర్ లు హైకోర్టును ఆశ్రయించాయి. విచారించిన న్యాయస్థానం.. ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ ఢిల్లీ ప్రభుత్వానికి మే 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ అంశంపై జులై ఆఖరి కల్లా కొత్త విధానాన్ని తీసుకు వస్తామని తమ వాదన వినిపిచింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందల్ తో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ఈ మేరకు వాదనలు విని ఢిల్లీ ప్రభుత్వ హామీని పరిగణనలోకి తీసుకుని తాత్కాలికంగా బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేసింది.