పోలీసుల్లో బీహార్ పోలీసులు భిన్నం. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాడు మరో ఉన్నతాధికారి.   తన కుమారుడిని జైలు నుండి విడుదల చేయాలంటూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళతో ఓ ఉన్నతాధికారి మసాజ్‌ చేయించుకున్నారు. సహర్సా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 


 






తన కుమారుడిని జైలు నుండి విడుదల చేయాలంటూ ఒక మహిళ సహర్సా జిల్లాలోని నౌహట్టా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అధికార దర్పం చూపించిన ఎస్‌ఐ తనకు మసాజ్ చేయాలని ఆదేశించారు. ఆ ఎస్ఐ పేరు శశిభూషణ్.  అడిగింది పోలీసు.. పైగా తన బిడ్డ స్టేషన్‌లో ఉన్నారు.. కాదంటే ఏం జరుగుతుందో ఆమెకు బాగా తెలుసు. అందుకే మరు మాట్లాడకుండా మసాజ్ చేసేసింది.  శరీరంపై దుస్తులు లేకుండా చిన్న టవల్‌తో ఉండగా మహిళ మసాజ్‌ చేయించుకున్నారు. 


ఆమెతో మసాజ్ చేయించుకుంటూ ఫోన్‌లో ఎస్‌ఐ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఓ లాయర్‌తో మాట్లాడుతున్నట్లుగా ఎస్ఐ షో చేశారు. పాపం పేద మహిళ అని.. రూ. పదివేలు సర్దుతుందని.. బెయిల్ వచ్చేలా చూడాలని కోరుతున్నారు. నిజానికి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి..ఆ పదివేలు కూడా ఆ ఎస్ఐ నొక్కేయాలనేది ప్లాన్ అని ఎవరికైనా తెలిసిపోతుంది. మసాజ్ చేయించుకోవడమే కాదు.. రూ. పదివేలు కూడా ఆ నిందితుడి తల్లి దగ్గర కొట్టేయాలనుకున్నాడు. 


ఈ దృశ్యాలను కొంత మంది పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న వారే చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. వీటిని ఓ జర్నలిస్ట్‌కు ఇవ్వడంతో వారు పోస్ట్ చేశారు.   ఈ వీడియోపై విచారణకు ఆదేశించామని, ఆ ఎస్‌ఐని సస్పెండ్‌ చేసినట్లు సహర్సా ఎస్‌పి ప్రకటించారు. 



నేరస్తులతో కలిసిపోయి శాంతి భద్రతలకు  ఎలాంటి భరోసా ఇవ్వకుండా వ్యహరించిన ఘటనలు బీహార్‌లో తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ దిశలోనే ఇప్పుడు పోలీసులు నిందితులంటూ అరెస్ట్ చేసుకొచ్చిన కుటుంబసభ్యులతో మసాజ్ చేయించుకోవడానికి కూడా వెనుకాడటం లేదు.