Bridge Collapsed : బిహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోతున్నాయి. వారం రోజుల్లోనే మూడో వంతెన కూలిపోయింది. సివాన్‌లోని మహారాజ్‌గంజ్ సబ్ డివిజన్‌లోని పటేధా , గరౌలి గ్రామాల మధ్య గండక్ కాలువపై వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. వాస్తవానికి, శనివారం ఉదయం అకస్మాత్తుగా వంతెన ఒక పిల్లర్ మునిగిపోవడం ప్రారంభించింది. కొద్దిసేపటికే వంతెన కాలువలో మునిగిపోయింది. వంతెన కూలిపోవడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణ పనుల్లో నాణ్యతపై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనికి ముందు అరారియా, సివాన్‌లలో కూడా వంతెనలు కూలిపోయాయి.


మోతీహరిలో  నిర్మాణంలో ఉండగానే వంతెన కూలిపోయింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ. 2 కోట్లు. తూర్పు చంపారన్‌లోని మోతిహరిలోని ఘోరసహన్ బ్లాక్‌లోని చైన్‌పూర్ స్టేషన్‌కు యాక్సెస్ రోడ్డుపై  వంతెన కూలిపోయింది. ఇక్కడ రెండు కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం జరుగుతోంది. వంతెన కాస్టింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ వంతెన పొడవు దాదాపు 50 అడుగులు.


సివాన్‌లో కూలిన వంతెన
శనివారం కూడా బిహార్‌లోని సివాన్‌లో వంతెన కూలింది.  ఇక్కడ మహారాజ్‌గంజ్-దరోండా అసెంబ్లీ సరిహద్దును కలిపే బ్రిడ్జి పేకమేడలా కళ్ల ముందే కూలిపోయింది. కాల్వలో పూడిక తీయడం వల్ల పిల్లర్లు బలహీనపడి బ్రిడ్జి కూలిపోయింది. అందుబాటులో ఉన్న బ్రిడ్జి కూలిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ప్రజలు తెలిపారు. ఆ ప్రాంతంలో  ఇప్పటి వరకు పెద్ద వర్షాలు కూడా పడలేదు.  అయినప్పటికీ మహారాజ్‌గంజ్ ప్రాంతంలోని పటేధి-గరౌలిని కలిపే కాలువపై నిర్మించిన వంతెన కూలిపోయింది.  దారుండా - మహారాజ్‌గంజ్ బ్లాక్ గ్రామాలను కలిపే కాలువపై ఈ వంతెనను నిర్మించినట్లు కలెక్టర్ ముకుల్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. వంతెన చాలా పాతదని తెలిపారు. కాలువ నుంచి నీటిని విడుదల చేయడంతో పిల్లర్లు బలహీనపడి కూలిపోయాయన్నారు.


1991లో అప్పటి మహారాజ్‌గంజ్ ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్ సహకారంతో ఈ వంతెనను నిర్మించినట్లు స్థానిక ప్రజలు తెలిపారు.  మహారాజ్‌గంజ్ సబ్ కలెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నిధులతో 20 అడుగుల పొడవైన వంతెనను నిర్మించామన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుందని త్వరలో తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.  


అరారియాలో కూలిన రూ.12 కోట్లతో నిర్మించిన వంతెన  
మంగళవారం అరారియాలో 180 మీటర్ల పొడవున కొత్తగా నిర్మించిన వంతెన కూలిపోయింది. అరారియాలోని సిక్తిలో బక్రా నదిపై ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా అంతకుముందే కూలిపోయింది. సిక్తి బ్లాక్‌లోని బక్రా నదిపై 12 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు.  మంగళవారం వంతెన మూడు పిల్లర్లు నదిలో మునిగిపోయాయని, ఆ తర్వాత అది కూలిపోయిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా సిక్తి ఎమ్మెల్యే విజయ్ మండల్ మాట్లాడుతూ..  ఈ వంతెనను జిల్లా గ్రామీణ పనుల శాఖ నిర్మించిందన్నారు.  పునాది లేకుండా నేలపైనే స్తంభాలు వేసి నిర్మించారు. ఇక్కడ అప్రోచ్ రోడ్డు కూడా నిర్మించలేదు. దాదాపు 12 కోట్ల రూపాయల వ్యయంతో 100 మీటర్ల వంతెన ఇది అన్నారు.


బిహార్ రాష్ట్రంలో వరుసగా బ్రిడ్జీలు కూలిపోతుండడంతో నితీష్ కుమార్ ప్రభుత్వం పై ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల కోసం బ్రిడ్జీలు నిర్మిస్తున్నారా.. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు కడుతున్నారా అని ప్రశ్నించారు.