Bihar Politics: దేశ రాజకీయాలు ట్విస్ట్ తర్వాత ట్విస్ట్ తో మాంచి థ్రిల్లింగ్ సినిమాను తలపిస్తున్నాయి. ఏ సినిమాలోనూ చూడని ట్విస్టులు రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. బీజేపీ మార్క్ రాజకీయంతో దేశవ్యాప్తంగా వేళ్లూనుకున్న పార్టీలు కూడా చతికిలబడుతున్నాయి. చీలికలు ఎదుర్కొంటూ అస్తిత్వం కోసం కిందా మీదా పడుతున్నాయి. నిన్న కాక మొన్న మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్ మెగా తిరుగుబాటు ఎపిసోడ్, తదనంతర సంఘటనలు ఇంకా మర్చిపోకముందే మరో ట్విస్ట్ కు రెడీ అయిపోయాయి దేశ రాజకీయాలు. మరికొన్ని రోజుల్లో బిహార్ లో కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడనుందని బీజేపీకి చెందిన సుశీల్ మోదీ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. 


బిహార్ లో అధికారంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ (JDU) కు చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీతో చర్చలు జరుపుతున్నారని, నితీశ్ కుమార్ పార్టీ చీలిక అంచున ఉందని సుశీల్ మోదీ అన్నారు. జేడీయూలో చీలిక వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, రానున్న రోజుల్లో ఏదైనా సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. అయితే జేడీయూ రెబల్స్ ను అంగీకరించి ఆహ్వానించే విషయంలో పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. నితీష్ కుమార్ బీజేపీని వెన్నుపోటు పొడిచిన తీరుపై జేడీయూ సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి అన్నారు. నితీశ్ కుమార్ తన వారసుడిగా తేజస్వి యాదవ్ ను ప్రకటించినప్పటి నుంచి వారు తమ భవిష్యత్తును, పార్టీ భవిష్యత్తును అంధకారంలో చూస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ రాదని వారికి తెలుసు అని మోదీ అనడం గమనార్హం.


గత ఏడాది జేడీయూకు 17 సీట్లు వచ్చాయని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జేడీయూకు 8 -10 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. అందరూ తమ భవిష్యత్తును అంధకారంలో పడేస్తున్నారని దీంతో సభ్యుల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలూ ఇతర పార్టీలను సంప్రదిస్తున్నారని చెప్పుకొచ్చారు. సుశీల్ మోదీ వ్యాఖ్యలు బీజేపీ ప్రచారమని జేడీయూ కొట్టిపారేసింది. జేడీయూ పార్టీ చెక్కుచెదరదని ధీమాగా నితీశ్ కుమార్ సన్నిహితుడు, పార్టీ జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ అన్నారు. 


మహారాష్ట్ర రాజకీయాల్లో రెండేళ్లలో చాలా మార్పులొచ్చాయి. ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటుతో ప్రభుత్వం మారిపోయింది. అప్పటికే మహారాష్ట్ర వికాస్ అఘాడి చీలిపోవడం మొదలైంది. ఇప్పుడు అజిత్ పవార్‌ తిరుగుబాటుతో పూర్తిగా కుప్పకూలిపోయింది. దాదాపు ఏడాదిగా సీక్రెట్‌గా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. శిందేతో పాటు బీజేపీతోనూ అనేక చర్చల తరవాత పక్కా ప్లాన్ ప్రకారం.. అజిత్ పవార్ NCP నుంచి బయటకు వచ్చేశారు. శిందే ప్రభుత్వంలో చేరి డిప్యుటీ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఆయనతో సహా మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్లంతా NCPలో కీలక నేతలే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ కూడా తిరుగుబాటు చేసిన వాళ్లలో ఉన్నారు.


శరద్ పవార్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలందరూ శిందే ప్రభుత్వంలో చేరడం షాక్‌కి గురి చేసింది. నిజానికి అజిత్ పవార్ ఇలా చేయడం కొత్తేం కాదు. 2019లోనూ బీజేపీకి దగ్గరయ్యారు. అయితే కొన్నాళ్ల తరవాత శరద్ పవార్ ఎలాగోలా ఆయనను మళ్లీ వెనక్కి రప్పించారు. కానీ ఈ సారి మాత్రం చాలా గట్టిగా నిలబడ్డారు అజిత్ పవార్. సరిగ్గా ఏడాది క్రితం శిందే ఎలాగైతే చేశారో...అదే స్టైల్‌లో NCPకి ఝలక్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఒక్కటే తేడా ఉంది. శిందే పార్టీని చీల్చితే..అజిత్ పవార్ మొత్తం పార్టీనే శిందే వర్గంలోకి తీసుకొచ్చారు. NCP మొత్తం శిందే వర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.