Nitish Kumar Swearing: 9వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహాఘట్‌బంధన్ నుంచి బయటకు వచ్చిన నితీశ్...బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందు గవర్నర్‌కి తన రాజీనామా లేఖ సమర్పించారు. ఆ తరవాత బీజేపీ మద్దతునిస్తూ ప్రకటించిన లేఖని ఆయనకు అందించారు. ఈ రెండు లేఖలనీ గవర్నర్ ఆమోదించడం వల్ల ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. నితీశ్ కుమార్‌తో పాటు సామ్రాట్ చౌదరి డిప్యుటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో బీజేపీ నేత విజయ్ సిన్హా కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ తరపున బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్ మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం 8 మందిని మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రధాని అభినందనలు..
బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. బిహార్‌లో NDA ప్రభుత్వం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది బాటలు వేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడుచుకుంటుందని తెలిపారు.
"బిహార్‌లో NDA ప్రభుత్వం ఏర్పాటు కావడం ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడుచుకుంటుంది. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా పని చేస్తుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్‌కి అభినందనలు"
- ప్రధాని నరేంద్ర మోదీ
మహాఘట్‌బంధన్‌లో చాలా సమస్యలున్నాయని, మునుపటి బలం ఆ కూటమిలో కనిపించడం లేదని రాజీనామా తరవాత తేల్చి చెప్పారు నితీశ్ కుమార్. అందుకే బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు. అటు I.N.D.I.A కూటమిపైనా విమర్శలు చేశారు. కూటమి ఏర్పాటైందనే తప్ప ఎవరూ ఏమీ చేయడం లేదని మండి పడ్డారు. మాట్లాడుకోడమూ మానేశామని తెలిపారు. ఈ కారణాల వల్లే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు స్పష్టం చేశారు.
"ప్రస్తుతానికి నేను అనవసరమైన వ్యాఖ్యలు చేయలేను. కానీ మహాఘట్‌బంధన్‌లో చాలా సమస్యలున్నాయి. ఏదీ సరిగా లేదు. ఈ విషయంలో చాలా మంది నేతలు నన్ను ప్రశ్నించారు. సలహాలు, సూచనలు ఇచ్చారు. వాళ్లందరి అభిప్రాయాలు తీసుకున్నాను. ఆ తరవాతే రాజీనామా చేశాను"
- నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
Also Read: Bihar Political Crisis: నితీశ్ జీ అసలు ఆట ముందుంది, 2024లో JDU కథ కంచికే - తేజస్వీ యాదవ్