Bihar Political Crisis: నితీశ్ కుమార్‌ మహాఘట్‌బంధన్‌ నుంచి బయటకి వెళ్లడంపై తేజస్వీ యాదవ్ స్పందించారు. ఆట అప్పుడే పూర్తి కాలేదని, ఇంకా మిగిలే ఉందని తేల్చి చెప్పారు. నితీశ్ కుమార్‌తో పొత్తు పెట్టుకున్నందుకు బీజేపీకి థాంక్స్ చెప్పారు. ఇదే సమయంలో నితీశ్‌పై సెటైర్లు వేశారు. ఆయన చాలా అలిసిపోయారని, అలాంటి వ్యక్తిని తాము సీఎం పదవిలో కూర్చోబెట్టామంటూ చురకలు అంటించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికీ తాము మద్దతునిచ్చామని, ఆయనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం ఇష్టం లేదని వెల్లడించారు. కానీ...నితీశ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. 2024లో JDU కథ ముగిసిపోతుందని తేల్చి చెప్పారు. 


"నితీశ్ కుమార్‌తో పొత్తు పెట్టుకుంటున్నందుకు బీజేపీకి థాంక్స్. ప్రస్తుతానికి వాళ్లకు శుభాకాంక్షలు తప్ప ఏమీ చెప్పలేం. ఇవాళ వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారేమో చేయనివ్వండి. కానీ...ఒకటి మాత్రం నిజం. ఆట ఇంకా ముగిసిపోలేదు. అసలు కథ ముందుంది. నితీశ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం నాకు ఇష్టం లేదు. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. కానీ నా మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. 2024లో జేడీయూ కథ ముగిసిపోతుంది"


- తేజస్వీ యాదవ్, RJD నేత 


 






ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని పదేపదే నితీశ్ కుమార్ (CM Nitish Kumar) వాదించారని, కానీ ఆ అసాధ్యాన్ని మేం సుసాధ్యం చేశామని తేల్చి చెప్పారు తేజస్వీ యాదవ్. ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించామని గుర్తు చేశారు. బీజేపీ-జేడీయూ ప్రభుత్వం చేయలేనివెన్నో తమ ప్రభుత్వం చేసి చూపించిందని స్పష్టం చేశారు.


"మేం చేసిన అభివృద్ధి పనులెన్నో ఉన్నాయి. ఆ క్రెడిట్ మేం ఎందుకు తీసుకోకూడదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అసాధ్యమని నితీశ్ వాదించేవారు. కానీ మేం దాన్ని సాధ్యం చేశాం. పర్యాటకం, ఐటీ, క్రీడా రంగాల్లో ఎన్నో కొత్త పాలసీలు తీసుకొచ్చాం. ఈ 17 నెలల్లో జరిగిన అభివృద్ధి పనులు 17 ఏళ్ల బీజేపీ జేడీయూ ప్రభుత్వంలో జరగలేదు"


- తేజస్వీ యాదవ్, RJD నేత