Political Crisis in Bihar: దేశవ్యాప్తంగా బిహార్ రాజకీయాల గురించే చర్చ. నిన్న మొన్నటి వరకూ బీజేపీపై సెటైర్లు, విమర్శలతో విరుచుకు పడిన నితీశ్ కుమార్ ఉన్నట్టుండి రాగం మార్చేశారు. మహాఘట్‌బంధన్‌లో ఏదీ సరిగా లేదని, మునుపటి బలమే కనిపించడం లేదని తేల్చి చెప్పేశారు. అందుకే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. బీజేపీతో చేతులు కలిపి NDAతో కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా మళ్లీ నితీశ్ కుమార్‌నే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ...అసలు ఇదంతా ఎందుకు జరిగింది..? ఎలా జరిగింది..? అనేవే తెరపైకి వస్తున్న ప్రశ్నలు. బీజేపీ ఏదైనా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోదు. ముందు నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని చాలా వ్యూహాత్మకంగా ఆట మొదలు పెడుతుంది. బిహార్‌లోనూ అదే జరిగింది. నితీశ్ యూటర్న్‌కి రూట్ మ్యాప్‌ నెల రోజుల క్రితమే రెడీ అయింది. కానీ...ఇప్పటి వరకూ అది సీక్రెట్‌గానే ఉండిపోయింది. "నితీశ్‌కు ఎంట్రీ ఇచ్చే అవకాశమే లేదు" అని తేల్చి చెప్పిన బీజేపీ ఉన్నట్టుండి ఆయనకు రెడ్‌కార్పెట్ వేసి మరీ ఎందుకు ఆహ్వానించింది..? బీజేపీతో పొత్తు పెట్టుకునేదే లేదంటూ మండి పడిన నితీశ్ కుమార్‌ ఇప్పుడు మళ్లీ అదే  గూటికి ఎందుకు వెళ్తున్నారు..? మహాఘట్‌బంధన్‌లో సమస్యలున్నాయన్నది పైకి చెప్పే కారణం. అసలు సంగతి వేరే ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ యూటర్న్‌కి ప్లాన్ అంతా కేంద్రహోం మంత్రి అమిత్‌షా సిద్ధం చేసినట్టు సమాచారం. సరిగ్గా 50 రోజుల క్రితం..అంటే 2023 డిసెంబర్ 10వ తేదీన అమిత్‌షా, నితీశ్ కుమార్‌ ఇద్దరూ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. 2022లో NDAతో తెగదెంపులు చేసుకున్న తరవాత ఇద్దరూ ఎదురు పడింది అదే తొలిసారి. ఆ తరవాతే బిహార్‌లో రాజకీయాలు మారడం మొదలైంది. 


50 రోజుల్లో మార్పులు..


రాజకీయ విశ్లేషకులు చెబుతున్న సమాచారం ప్రకారం...డిసెంబర్ 29న అంటే...అమిత్‌షా, నితీశ్ కలుసుకున్న 19 రోజుల తరవాత నితీశ్ కుమార్ జాతీయ స్థాయి భేటీకి పిలుపునిచ్చారు. ఆ సమయంలో జాతీయ అధ్యక్షుడి పదవిని తానే చేపట్టారు. అప్పటి వరకూ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న లలన్‌ సింగ్‌ని పక్కన పెట్టేశారు. ఆయన అధ్యక్షుడు అయిన తరవాత నుంచే అసలు కథంతా మొదలైంది. 15 రోజుల తరవాత నితీశ్ యూటర్న్ ప్లాన్ అమలు చేశారు. ఆ తరవాత మీడియా చాలా సార్లు అమిత్‌షాని బిహార్ రాజకీయాల గురించి ప్రశ్నించింది. నితీశ్ కుమార్‌ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా..? అని అడిగితే "మా మధ్య అలాంచి చర్చేమీ జరగలేదు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఏదైనా వస్తే తప్పకుండా పరిశీలిస్తాం" అని సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో నితీశ్ బీజేపీతో కలిసిపోతారన్న ప్రచారం ఇంకాస్త బలపడింది. ఇదంతా కేవలం 50 రోజుల్లో జరిగిందే. I.N.D.I.A కూటమిలో యాక్టివ్‌గా ఉన్న నితీశ్‌ని తమవైపు లాగేసుకుంటే ఆ కూటమి బలహీనపడుతుందని బీజేపీ ఇలా ఎత్తుగడ వేసిందన్నది కొందరి విశ్లేషణ. ఏదేమైనా లోక్‌సభ ఎన్నికల ముందు ఇంత తొందరగా అక్కడి రాజకీయ పరిణామాలు మారిపోతాయని ఎవరూ ఊహించలేదు. 


Also Read: Bihar Political Crisis: నితీశ్‌కు ప్రధాని మోదీ అభినందనలు, రాజీనామా తరవాత ప్రత్యేకంగా ఫోన్ కాల్