Bengaluru Crime News: బెంగళూరులో పావురాలను ఉపయోగించుకున్న వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి 30 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ప్లాన్ విన్న పోలీసులే షాక్ తిన్నారు. 


చోరీల్లో చేయితిరిగిన వ్యక్తి


మంజునాథ్ అనే 38 ఏళ్ల వ్యక్తి చాలా కాలంగా దొంగతనాలు చేస్తూ తరచూ జైలుకు వెళ్లి వచ్చేవాడు. ఎన్నిసార్లు జైలుకు వెళ్లి వచ్చినా ఆయన తీరులో మార్పు రాలేదు. జైలుకు వెళ్లడం బెయిల్‌పై రావడం మళ్లీ చోరీలు చేయడం ఆయన అలవాటైన పని. 


ఖతర్నాక్ ప్లాన్ 


నిఘా పెరిగిపోవడంతో చోరీలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. దీని నుంచి తప్పించుకునేందుకు మంజునాథ్‌ ఖతర్నాక్ ప్లాన్ వేశాడు. తన చోరీలను మరింత సులభతరం చేసుకునేందుకు పావురాలను పెంచుకోవడం మొదలు పెట్టాడు. 


పావురాలకు ట్రైనింగ్


పావురాలు పెంచుకొని ఎలా చోరీలు చేస్తావని పోలీసులు ప్రశ్నిస్తే... మంజునాథ్ చెప్పిన ఆన్సర్‌కు పోలీసులు ఫీజులు అవుట్ అయ్యాయి. ఈగ సినిమాలో ఈగకు సమంత ట్రైనింగ్ ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా పావురాలకు మంజునాథ్ ట్రైనింగ్ ఇచ్చాడు. వాటి శరీరానికి చిన్న చిన్న కెమెరాలు, ట్రాన్స్‌మీటర్లు అమర్చి వాటితో ప్రాక్టీస్ చేయించాడు. 


సెక్యూరిటీపై నిఘా 


కెమెరాలు అమర్చిన పావురాలకు బాగా ట్రైనింగ్ ఇచ్చి... వాటిని కాలనీల్లోకి వదిలేవాడు. పావురాలు వెళ్లే ఏరియాను తన మొబైల్‌లో చూసుకునేవాడు. పావురాల ద్వారా ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో గమనించేవాడు. ఎక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేరో పరిశీలించేవాడు. తాళాలు వేసిన ఇళ్లను ఐడెంటిఫై చేసేవాడు. 


పావురాలతో రూట్‌ మ్యాప్


ఇలా ఆ కాలనీలో ఎలా పారిపోవచ్చు. ఎక్కడి నుంచి రావచ్చు షార్ట్ రూట్ ఏది అనే వివరాలు తెలుసుకున్న తర్వాత దోపిడీకి స్కెచ్ వేసేవాడు. పావురాలు వదిలేటప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే... పావురాలు తప్పిపోయి వచ్చాయని వాటిని పట్టుకోవడానికి వచ్చానంటూ కవర్ చేసే వాడు. 


ఒక కాలనీలో పని పూర్తి అయిన తర్వాత మరో ఏరియాకు వెళ్లిపోయేవాడు. ఇలా దాదాపు 50 ఇళ్లల్లో చోరీలు చేసేవాడు. చోరీ టైంలో కూడా పావురాలను వదిలి వచ్చిపోయే వారి కదలికలు గమనించేవాడు. ముందు ఇంటి తాళాన్ని ఇనుపకడ్డీతో విరిచి ఇంట్లోకి ప్రవేశించేవాడు. నగదు, బంగారం ఎక్కడ ఉందో చూసుకొని అపహరించేవాడు. 


షాక్ అయిన పోలీసులు


వరుస చోరీలు జరుగుతుండటంతో విచారణ చేపట్టిన పోలీసులు మంజునాథ్‌పై అనుమానం వచ్చింది. అరెస్టు చేసి ప్రశ్నిస్తే అసలు విషయం తెలిసింది. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు 30 లక్షల రూపాయల విలువైన 475 గ్రాముల బంగారం, టూవీలర్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా మంజునాథ్‌ పలు దారిదోపిడీలకు పాల్పడ్డాడు. పనికి వెళ్లేవారిని టార్గెట్ చేసి పట్టపగలు దోచుకునేవాడు. 


Also Read: అనాథాశ్రమంలో ఉండలేనని ఏడ్చిన 8 ఏళ్ల బాలుడు- తల్లి వినలేదని బావిలో దూకి ఆత్మహత్య