Dog 'Goa' Pays Tribute To Ratan Tata For The Last Time: పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాకు (Ratan Tata) మూగజీవాలంటే అమితమైన ప్రేమ. వీధి శునకాల సంరక్షణ కోసం ఆయన ఆస్పత్రులను కూడా నిర్మించారు. తాజ్ హోటల్ ప్రాంగణంలోనూ వీధి కుక్కలకు ప్రవేశం కల్పించడం టాటా ఔన్నత్యానికి నిదర్శనం. అలాంటి మహనీయుడు బుధవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం ముంబై వర్లీ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే రతన్ టాటా పెంపుడు కుక్క 'గోవా' ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చింది.






టాటా పార్థీవదేహం వద్ద వేదనతో కూర్చుని కన్నీటి నివాళి అర్పించింది. శునకం పడుతున్న వేదనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, 'గోవా'తో రతన్ టాటాకు మంచి అనుబంధం ఉంది. ఓసారి పని మీద రతన్ టాటా గోవా వెళ్లారు. అదే సమయంలో ఈ శునకం ఆయన వెంటే నడవడం ప్రారంభించింది. దీంతో దాన్ని చూసి ముచ్చట పడిన టాటా.. దాన్ని దత్తత తీసుకుని గోవా అని పేరు పెట్టారు. గోవాను ముంబయి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అలా దాదాపు 11 ఏళ్లుగా 'గోవా' రతన్ టాటాతో ఉంటున్నట్లు.. శునకం కేర్‌టేకర్ మీడియాకు వెల్లడించారు. కాగా, రతన్ టాటా చివరిసారిగా ఓ ప్రాజెక్టు కోసం పని చేయగా.. అది కూడా శునకాల కోసమే. ముంబయిలో ఐదు అంతస్తుల భవనంలో 'పెట్ ప్రాజెక్ట్' పేరిట దీన్ని ప్రారంభించారు. దీనిలో 200 శునకాలకు సౌకర్యం ఉంది.


Also Read: Ratan Tata: రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు - వర్లి శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు