Bengaluru House Rents:


బెంగళూరు అద్దెల భారం..


బెంగళూరులో ఇంటి అద్దెలు కట్టాలంటే కాస్తో కూస్తో కూడబెట్టుకున్న సేవింగ్స్‌ అంతా ధార పోయాల్సిందే. ఆ రేంజ్‌లో ఉంటాయి అక్కడ రెంట్‌లు. అందుకే చాలా మంది ఒకేసారి లీజ్‌కి తీసుకుని కొంత వరకూ ఆ భారం నుంచి బయట పడతారు. కానీ...ఇప్పుడా సిటీలో ఇల్లు దొరకడం గగనమైపోయింది. ఎక్కడా ఖాళీ ఇళ్లే కనిపించడం లేదు. ఇల్లు చిన్నదైనా, పెద్దదైనా సరే డిమాండ్‌ భారీగానే ఉంటోంది. ఈ డిమాండ్‌కి తగ్గట్టుగానే ఓనర్లు రెచ్చిపోతున్నారు. కాస్త చోటుకే గట్టిగానే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓసారి No Broker సైట్‌ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ సైట్‌లో చాలా మంది ఓనర్‌లు తమ ఇంటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తుంటారు. ఇలానే ఓ యజమాని ఓ బెడ్‌ రూమ్‌ ఫొటో షేర్ చేశాడు. సరిగ్గా ఒక్క బెడ్‌ మాత్రమే పట్టేంత ఆ చోటుకే రూ.12 వేల అద్దె చెల్లించాలని కండీషన్ పెట్టాడు. అందుకు ఒప్పుకుంటేనే కాంటాక్ట్ అవ్వాలని తేల్చి చెప్పాడు. అప్పటి నుంచి ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.


Reddit లో కొందరు ఈ పోస్ట్‌ని షేర్ చేసి మండి పడుతున్నారు. కేవలం ఒకటే బెడ్‌ ఉన్న రూమ్‌ అది. అది కూడా చాలా అంటే చాలా చిన్నగా ఉంది. ఇంత చిన్న స్పేస్‌కే రూ.12 వేలు కట్టాలా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. "బెడ్‌ ఉన్నంత మాత్రాన అది బెడ్‌రూమ్ అయిపోతుందా..? బెంగళూరులో మరీ ఇంత దారుణమా..? ఈ చిన్న స్పేస్‌కే రూ.12 వేలు కట్టాలంటే ఎలా" అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే "టాయిలెట్‌ని బెడ్‌రూమ్‌గా మార్చేశారా" అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి కొందరు హాస్టల్సే నయమని అంటున్నారు. "హాస్టల్స్ ఈ రూమ్‌ కన్నా చాలా బెటర్. అన్ని వసతులున్నా రూ.5-7 వేలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాయి" అని కామెంట్స్ చేస్తున్నారు. "చీమల బెడ్‌రూమా" అని ఇంకొందరు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 


చాలా మంది ఉద్యోగులు వీకెండ్‌ రాగానే బెంగళూరు నగరంలో కిరాయి ఇళ్ల వేట (Rent) మొదలు పెడుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే బయల్దేరుతున్నారు. 'కోరమంగల చుట్టుపక్కల టు లెట్‌ బోర్డులు ఉన్నాయేమో చూసేందుకు వెళ్తాను. అయితే బెంగళూరు నగరంలో (Bangalore)  ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగాయి. రోజులో ఒక్క ఇంటినైనా వెతికి పట్టుకోవడం చాలా కష్టమవుతోంది. ఈ ప్రాంతంలోని మంచి ఇళ్లలో సింగిల్‌ బెడ్‌రూమ్‌ కనీస అద్దె రూ.20,000 ఉంది. గతంలో ఇక్కడ రూ.10000-14000 ఉండేది' అని బాధితులు వాపోతున్నారు. పైగా నాలుగైదు గంటలు బయటకు వెళ్తొస్తుంటే ప్రయాణాలు, క్యాబులు, ఇతర ఖర్చులకు జేబులు ఖాళీ అవుతున్నాయని బాధపడుతున్నారు. బెంగళూరు నగరంలో ఇళ్ల కొరత విపరీతంగా ఏర్పడింది. డిమాండ్‌కు తగినట్టుగా ఖాళీ ఇళ్లు కనిపించడం లేదు. దాంతో అద్దెలు (Rentals) ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 40 శాతం మేర కిరాయి పెంచారని తెలిసింది. దీంతో బ్రోకర్లు కొందరు ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ను నియమించుకొని 'ఇళ్ల వేట ప్యాకేజీలు' ప్రకటిస్తున్నారు.


Also Read: అబార్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, గతంలో ఇచ్చిన తీర్పుతో విభేదించిన ధర్మాసనం